శింగరకొండ హుండీ ఆదాయం రూ.30.41 లక్షలు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం దేవస్థాన సహాయ కమిషనర్ తిమ్మానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 28 నుంచి ఇప్పటి వరకు 77 రోజుల్లో ఆలయానికి వచ్చిన భక్తులు సమర్పించిన హుండీలోని కానుకను లెక్కించగా రూ.30,41,065 వచ్చినట్లు సహాయ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు రావాల్సిన అరియర్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2018, 2019 సంబంధించిన డీఏ అరియర్ బిల్లులు, 2023, 2024 సంబంధించి సరెండర్ లీవ్ బకాయిలు, పదవీ విరమణ పొందిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ సరెండర్ లీవ్ ఆఫ్ పే లీవ్, మూడు నుంచి ఆరు విడతల డీఏ బకాయిలను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ కమిషన్ నియమించి ప్రస్తుతం రావాల్సిన మూడు విడతల డీఏ 2025 జనవరి, జూలై, 2026 జనవరి నెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డీఏలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ప్రస్తుతం 30 శాతం ఐఆర్ చెల్లించాలని కోరారు.


