‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా | - | Sakshi
Sakshi News home page

‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా

Feb 12 2026 11:28 AM | Updated on Feb 12 2026 11:28 AM

‘పోరం

‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా

కొనకనమిట్ల:

టీడీపీ నేతల ధనదాహానికి ప్రకృతి వననులు ధ్వంసమవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల యజమానులతో ఒప్పందం చేసుకున్న కొందరు పచ్చ నేతలు.. అధికారులపై అజమాయిషీ చేస్తూ గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లే.. కొనకనమిట్ల పరిధిలోని కొండ పోరంబోకు భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలకు రంగం సిద్ధం చేసిన టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం పచ్చని వృక్షాలను జేసీబీలతో పెకలించి సొమ్ము చేసుకున్నారు. తద్వారా గ్రావెల్‌ రవాణాకు ‘మార్గం’ సుగమం చేసుకున్నారు. ‘రియల్‌’వ్యాపారులకు అవసరమైన మట్టిని ప్రభుత్వ భూముల్లో తవ్విస్తూ టిప్పర్‌కు రూ.2 వేలు, ట్రాక్టర్‌కు రూ.200 లెక్కన వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణా తంతు మొత్తం రాత్రి వేళ దర్జాగా సాగిస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం మొత్తం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేదల ఇళ్ల స్థలాల పక్కనే తవ్వకాలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కొనకనమిట్ల కొండ సమీపంలో ఉన్న భూమిని చదును చేసి జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వకాలు చేస్తుండటంతో భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల దొనకొండ అడ్డరోడ్డు వద్ద ఉన్న వెంచర్‌కు టిప్పర్‌తో మట్టి తోలుతుండగా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద స్థానిక రెవెన్యూ అధికారులు ఆపి మాట్లాడి పంపిచేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సోమవారం రాత్రి కూడా కొనకనమిట్ల సమీపంలో జగనన్న కాలనీ పక్కనే జేసీబీతో మట్టి తవ్వి ట్రాక్టర్ల సాయంతో తరలించారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా చెట్లు తొలగించడమే కాకుండా అక్రమంగా గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్‌ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ గ్రావెల్‌ మైనింగ్‌పై తహసీల్దార్‌ సురేష్‌ను వివరణ కోరగా ‘మట్టి తవ్వకాల విషయం నాకు తెలియదు. కనుక్కొంటాను. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం’ అని ముక్తాయించారు.

‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా 1
1/2

‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా

‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా 2
2/2

‘పోరంబోకు’ల గ్రావెల్‌ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement