రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం

Feb 12 2026 11:28 AM | Updated on Feb 12 2026 11:28 AM

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం వివాహిత ఆత్మహత్య అదిగదిగో పెద్ద పులి!

ఒంగోలు టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదని, రైతుల గురించి ఆలోచించే తీరిక, ఓపిక లేనట్లు వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పొగాకు బోర్డు మాజీ సభ్యుడు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రబీలో వరి తరువాత అత్యధికంగా శనగ పండిస్తున్నారని, అనంతపురం, శ్రీసత్య సాయి, కర్నూలు, నంద్యాల, వైఎఎస్సార్‌ కడప, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 9.2లక్షల ఎకరాల సాగు చేస్తున్నారని తెలిపారు. సుమారు 6 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని అంచనాలు ఉన్నట్లు చెప్పారు. 2024, 2025 రబీలో నష్టాలకు శనగ అమ్ముకున్నారని, ఇప్పుడు 2026లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల నుంచి రూ.5,200లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.5,650 ఉన్నా ఆ ధర గురించి పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో శనగ క్వింటా రూ.8 వేలకు పైనే అమ్ముడుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2025 శనగలను కొందరు రైతులు కోల్డ్‌ స్టోరేజీలో దాచుకున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా గత ఏడాది కంటే 4.66 లక్షల హెక్టార్లలో శనగ సాగు పెరిగిందని, మన రాష్ట్రంలో కూడా శనగ సాగు పెరిగినట్లు తెలిపారు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి 10 శాతం డ్యూటీ మూలంగా విదేశాల నుంచి శనగలు దిగుమతి జరిగి దేశంలో రైతుల తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాకు వేయి రుపాయలు అదనంగా మద్దతు ధరను పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా శనగ రైతులకు న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడం సిగ్గుచేటన్నారు.

ఒంగోలు టౌన్‌: చెడు వ్యసనాలకు గురైన భర్త వ్యవహార శైలితో విసిగి వేసారిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేసే చంద్రశేఖర్‌, పద్మజ దంపతులు గోపాల్‌నగర్‌ నాల్గవ లైనులో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా చంద్ర శేఖర్‌ చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. ఎంతకూ మారకపోవడంతో విరక్తి చెందిన పద్మజ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు పెద్దపులి తారసపడటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అందిన వివరాల మేరకు.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 6వ తేదీ నుంచి నల్లమల అడవిలో ఒకే ఒక్క ప్రాంతం నుంచి పాదయాత్ర భక్తులకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా వెంకటాపురం నుంచి పాదయాత్ర చేస్తున్న భక్తులకు మంగళవారం రాత్రి పెచ్చెరువు వద్ద పెద్దపులి కనిపించిందన్న వార్తతో యాత్రికుల్లో కలకలం రేగింది. దీంతో పెద్ద సంఖ్యలో పాద యాత్రికులు ఒకే ప్రాంతంలో చాలాసేపు వేచి ఉన్నారు. పెద్దపులి సంచారం ప్రస్తుతానికి లేదని అధికారులు నిర్ధారించిన అనంతరం తిరిగి పాదయాత్ర కొనసాగించారు. పెద్దపులి సంచారంపై పెద్దదోర్నాల ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి హరిని వివరణ కోరగా.. పెచ్చెరువు ఆత్మకూరు పరిధిలో ఉందని, తమ పరిధి కాదని, పూర్తి వివరాలు తెలియవని బదులిచ్చారు. పెద్దపులి రాత్రి వేళల్లో స్వేచ్ఛగా సంచరిస్తుందని, ఎవరిపై ఎటువంటి దాడులకు పాల్పడదని చెప్పారు. ప్రస్తుతం నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల గణన చేపడుతున్నందున భక్తులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement