అంతర్ జిల్లా నేరస్తుల ముఠా అరెస్టు
మార్కాపురం టౌన్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా నేరస్తుల ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల నుంచి ఒక పల్సర్, 3 బుల్లెట్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో పట్టణ, రూరల్ ఎస్సైలు సైదుబాబు, వేమనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మార్కాపురం టౌన్‌లోని 10వ వార్డుకు చెందిన సయ్యద్ మసీద్ అలియాస్ ఆసిఖ్, ఇదే వార్డులోని విజయ థియేటర్ వద్ద ఉండే దూదేకుల మొహిద్దీన్ షా, గుంటూరు టౌన్‌లోని నల్లచెరువు 7వ లైన్‌లో తాత్కాలిక నివాసముంటున్న పులి అంజిరెడ్డి ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడి మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. వీరిపై ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. జైల్లో ఉన్న సమయంలో స్నేహితులైన ముగ్గురు యువకులు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బైకు చోరీలకు అలవాటుపడ్డారు. ఈ నెల 2వ తేదీన మార్కాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని రాయవరం వద్ద బైకు చోరీ కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం మార్కాపురం మండలంలోని కుంట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నంద్యాల వైపు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌లో విచారించగా గుంటూరులో 2, వినుకొండలో 1, రాయవరంలో 1 బైకు చోరీ చేసి నికరంపల్లి సమీపంలోని చిల్లచెట్లలో దాచిపెట్టినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు.
3 బుల్లెట్ బైక్‌లు, ఒక పల్సర్ స్వాధీనం
నిందితులపై ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో
పలు కేసులు
అంతర్ జిల్లా నేరస్తుల ముఠా అరెస్టు


