జగన్ హయాంలోనే పాలుట్ల అభివృద్ధి
నాసిరకం పరికరాలతో సోలార్ వెలుగులు అంటూ ఆర్భాటాలు గతంలోనే గిరిజన గూడెంలో వెలిగిన దీపాలు ఎంపీ నిధులతో వీధుల్లో ఏర్పాటు చేసిన సోలార్ దీపాలు
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన గూడాలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు ఇచ్చారని, తమ ప్రభుత్వ కాలంలోనే పాలుట్ల గిరిజన గూడెంను పంచాయతీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలుట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభిస్తున్న సోలార్ ప్యానల్ పరికరాల్లో సమస్యలు ఉన్నాయని కొంతమంది గిరిజనులు ఆరోపిస్తున్నారని, వాటి పరిస్థితిని గమనించి కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇదేవిధంగా ప్రచార ఆర్భాటంతో, కాసుల కక్కుర్తి కోసం నాసిరకం సోలార్ పరికరాలు ఏర్పాటు చేశారని, ఆ వెలుగులు పట్టుమని 12 నెలలు నిండక ముందే పనిచేయడం మానేశాయన్నారు. సోలార్ పరికరాల ప్యానల్ జీవితకాలం కనీసం 25 సంవత్సరాలు ఉంటుందన్న వాస్తవాన్ని గమనించాలని, ప్రస్తుతం బిగిస్తున్న పరికరాల నాణ్యత లోపాలను సరిచేయాలన్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు:
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ఎంపీ నిధులతో పాలుట్ల గిరిజన గూడెంలో వీధి దీపాలు వెలిగించి అటవీ మృగాలు, విషపురుగుల బారి నుంచి రక్షణ కల్పించారని, ఆ పంచాయతీ అభివృద్ధి కోసం రూ.42 లక్షలు ఖర్చుపెట్టి గ్రామ సచివాలయం నిర్మించారని, జల్‌జీవన్ మిషన్ కింద రూ.29 లక్షలు వెచ్చించి ఇంటింటికీ మంచి నీటి సదుపాయం కల్పించారని, రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, రూ.15 లక్షలతో అప్రోచ్ రోడ్డు వేశారని, నాడు–నేడు కింద రూ.20 లక్షలతో పాఠశాలను ఆధునీకరించారని, ప్రస్తుతం జిల్లా పరిషత్ గ్రాంట్ కింద రూ.25 లక్షలు మంజూరు చేయించి ప్రధాన రోడ్డు వేయనున్నారని ఆయన అన్నారు. గిరిజనుల జీవన విధానాలకు మెరుగైన వ్యవస్థను జగనన్న పాలనలోనే ఏర్పాటు చేశారన్నారు. పాలుట్ల పంచాయతీని మరింతగా అభివృద్ధి పరచాలన్న ప్రధాన ఉద్దేశంతో ఢిల్లీలోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూయల్ ఓరంను ఈ నెల 4వ తేదీ కలిసి వారి అభివృద్ధిపై చర్చించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి ఏర్పాటు చేయాల్సిన పథకాలు అందకపోవడం వలన వారి అభివృద్ధి కుంటుపడిందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో కలిసి పాలుట్ల గిరిజన గూడెం వాసులు ఎదుర్కొంటున్న రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, రోడ్డును అడ్డుకుంటున్న అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. పాలుట్ల పంచాయతీలోని పవిత్రమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జెడ్పీ గ్రాంట్‌తో బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేశామని అన్నారు. 6 సార్లు అధికారంలోకి వచ్చిన టీడీపీ నేటికీ ఆ గ్రామానికి చేసింది ఏమీలేకపోయినా.. ప్రచార ఆర్భాటాల కోసం గిరిజన గూడెంలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, నియోజకవర్గ యూత్ కన్వీనర్ ఆళ్ల కృష్ణారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్ మొహమ్మద్ ఖాసీం పాల్గొన్నారు.


