చుట్టాల్లా వచ్చి.. సొమ్ము కాజేసి..
కూతురి పెళ్లికి అప్పు.. దాన్ని తీర్చేందుకు తప్పు
ఒంగోలు టౌన్: వివాహ శుభకార్యానికి బంధువుల్లా వచ్చి ఎంచక్కా బంగారు నగలు, నగదు చోరీ చేసి సొంతూరుకు చెక్కేసిన మధ్యప్రదేశ్ ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఓ మైనర్ ఉన్నాడు. అలాగే ప్రయాణికురాలి ముసుగులో చోరీలకు తెగబడుతున్న మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డుకు చెందిన గుండవరపు కిషోర్ కుమార్ తన కుమార్తె వివాహాన్ని నవంబర్ 27వ తేదీన స్థానిక బృందావన్ కళ్యాణ మండపంలో చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులంతా హడావుడిగా ఉన్నారు. ముహూర్త సమయంలో 158 గ్రాముల బంగారు నగలు, రూ.1.35 లక్షల నగదును ఒక బ్యాగులో ఉంచి వధూవరులను ఆశీర్వదించేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి చల్లగా జారుకున్నారు. కాసేపటి తర్వాత నగలు, నగదు పోయిన విషయాన్ని గుర్తించిన కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యప్రదేశ్‌లోని సాన్సి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మైనర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు హరి ఓం, వికాస్‌తోపాటు ఓ బాలుడిని వారి స్వగ్రామంలోనే తాలుకా సీఐ విజయకృష్ణ బృందం పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి బంగారు నగలతోపాటు, రూ.1.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.20.20 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. చోరీ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన తాలుకా సీఐ బృందాన్ని ఎస్పీ అభినందించారు.
కటకటాల్లోకి ఒంగోలు ‘బృందావనం’ దొంగలు
పెళ్లి బంధువుల్లా వచ్చి చోరీకి పాల్పడిన మధ్యప్రదేశ్ ముఠా
158 గ్రాముల బంగారు నగలు, రూ.1.35 లక్షల నగదు స్వాధీనం
ప్రయాణికురాలిగా నటిస్తూ చోరీలు చేస్తున్న మరో మహిళ అరెస్టు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు
కూతురి వివాహానికి చేసిన అప్పు తీర్చడం కోసం ఓ మహిళ చోరీలను మార్గంగా ఎంచుకుంది. మద్దిపాడు పరిధిలో నమోదైన చోరీ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన తొండ శాంతి ఉరఫ్ కాశమ్మను అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కథనం మేరకు.. కాశమ్మ తన కూతురి వివాహానికి రూ.3 లక్షలు అప్పు చేసింది. అది తీర్చే మార్గం లేకపోవడంతో కోళ్లను చోరీ చేయడం మొదలుపెట్టింది. దాని వల్ల పెద్దగా సంపాదన లేదని భావించి తన తోడుకోడళ్లతో కలిసి ఆటోల్లో ప్రయాణికుల బ్యాగుల్లో సొత్తును చోరీ చేయడం మొదలుపెట్టింది. మద్దిపాడు మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన మల్లిపెద్ది ధనలక్ష్మి ఈ నెల 1వ తేదీన నరసరావుపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కి ఒంగోలు వచ్చింది. ఆమెను అనుసరించిన తొండ శాంతి కూడా ఒంగోలు చేరుకుంది. ధనలక్ష్మి ఎక్కిన ఆటోలోనే ఎక్కి ఆమె బ్యాగులో ఉన్న బంగారు నగలను కాజేసింది. ఏమీ తెలియనట్టు మధ్యలోనే ఆటో దిగి వెళ్లిపోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితురాలిని గుర్తించిన పోలీసులు బుధవారం మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఉన్న శాంతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు చంద్రహారం, గొలుసు, నలపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన మద్దిపాడు ఎస్సై జి.వెంకటసూర్య, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.


