బడుగుల జాగాలోకి బలమున్నోళ్లు!
● టీడీపీ నేతల అండతో చెలరేగుతున్న ఆక్రమణదారులు
● మార్కాపురం ఇందిరమ్మ కాలనీలో రాత్రికి రాత్రే స్థలాలు కబ్జా
● గత రెండు రోజుల్లో 175 ప్లాట్లు ఆక్రమించిన వైనం
● బేస్‌మెంట్లు వేసి దౌర్జన్యం చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబో
● ఫిర్యాదుల పరంపరతో కూల్చివేతకు దిగిన రెవెన్యూ అధికారులు
మార్కాపురం: మార్కాపురం జిల్లా ప్రకటించిన దరిమిలా భూ ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందని అధికార పార్టీ నేతలు డప్పు కొట్టినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భూములు కొనడం దండగ అని భావించిన కొందరు అక్రమార్కులు అధికార టీడీపీ నేతల అండతో పేదల స్థలాల్లోకి చొరబడుతున్నారు. రాత్రికి రాత్రే నివాస స్థలాలు కబ్జా చేసి బేస్‌మెంట్లు సైతం నిర్మిస్తున్నారు. ఆక్రమణదారుల ఆగడాలు చూసి పేదలు లబోదిబోమంటూ రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తున్న పరిస్థితి.
మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కూటమి నేతల అండ చూసుకుని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే గోడలు పెట్టి ఆక్రమిస్తున్నారు. 2 రోజుల క్రితం మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో రిటైర్డు ఎస్సైతో పాటు పలువురు ఆర్మీ ఉద్యోగుల స్థలాన్ని అధికార టీడీపీకి చెందిన నాయకుడు ఆక్రమించేందుకు బరితెగించాడు. హక్కుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలు తొలగించారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ కాలనీలో 2 రోజుల వ్యవధిలో భూకబ్జాదారులు సుమారు 175 ప్లాట్లు ఆక్రమించారు. రాత్రికి రాత్రే సిమెంటు ఇటుకలతో బేస్‌మెంట్లు కట్టడాన్ని చూసి ప్రజలతో పాటు రెవెన్యూ అధికారులు సైతం విస్తుపోయారు. మంగళవారం ఉదయం తమ స్థలాల్లో బేస్‌మెంట్లను చూసిన ఇందిరమ్మ కాలనీ వాసులు లబోదిబోమంటూ రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు. తమ భూములకు రక్షణ లేదని, ఆక్రమణదారులు చెలరేగుతున్నా కట్టడి చేయడం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రెవెన్యూ, పోలీసు, గృహ నిర్మాణ శాఖ అధికారులకు వరుసబెట్టి ఫిర్యాదులు చేశారు. దీంతో మంగళవారం తహసీల్దార్ చిరంజీవి, డీఈ పవన్‌కుమార్, పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను గుర్తించి జేసీబీతో కూల్చివేయించారు. ఇందిరమ్మ కాలనీలోని హక్కుదారులు తమ స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచించారు.
భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
మార్కాపురం జిల్లా కాబోతున్న నేపథ్యంలో భూకబ్జాదారులు అల్లూరి పోలేరమ్మ గుడి, ఇందిరమ్మ కాలనీ ఫేజ్–2లో 20 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మంగళవారం ఉదయం పోలీసు, గృహ నిర్మాణశాఖ అఽధికారులతో కలిసి సుమారు 150కి పైగా బేస్‌మెంట్లను తొలగించాం. ఆక్రమణదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. కాలనీలో స్థలాలు ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేస్తున్నాం. – చిరంజీవి, తహసీల్దార్
జేసీబీతో అక్రమనిర్మాణం తొలగింపు
బడుగుల జాగాలోకి బలమున్నోళ్లు!


