చెత్త రాజకీయాలు ఆపండి
కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మికులు, సీఐటీయూ నాయకులు
ఒంగోలు సబర్బన్: మున్సిపల్ శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు నగర కమిషనర్ చాంబర్‌ను సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ముట్టడించారు. కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఒంగోలు నగర కన్వీనర్ టి.మహేష్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులను వార్డులు మార్చడంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలో పారిశుధ్య కార్మికులు పనిచేయట్లేదని ముద్ర వేసి ఇష్టారీతిగా వార్డులు మారుస్తూ రాజకీయాలు చేయడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ఈ విధానం సరైనది కాదని కార్మికులు యూనియన్ నాయకులు అనేకసార్లు చెప్పినా బలవంతంగా వార్డులు మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అధికారులకు రెండుసార్లు అవార్డులు ప్రకటించిందని, తుఫాను విపత్తు సందర్భాల్లో శానిటేషన్ కార్మికులు ఫ్రంట్ వారియర్స్‌గా పని చేశారంటూ సన్మానించారని గుర్తు చేశారు. అయితే కార్మికులు పని చేయడం లేదని అభాండాలు వేస్తూ రాజకీయ కారణాలతో తొలగింపులు, కక్ష సాధింపులకు దిగడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్రపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, నేటికీ చనిపోయిన కుటుంబాల వారికి ఈ కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నేటికీ వారి పీఎఫ్ క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్మికులకు అవసరమైన మెటీరియల్, కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కార్మికులపై వేధింపులు, కక్ష సాధింపులు పెరిగాయని ఆరోపించారు. ఒంగోలు మూడో డివిజన్ పరిధిలో కార్మికులందరినీ వార్డు మార్చారని, మార్చిన చోట పనిచేయకపోతే ఉద్యోగం ఊడు తుందని శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఎమ్‌హెచ్‌ఓ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. యూనియన్ నాయకులకు కనీస సమాచారం లేకుండా బలవంతంగా వార్డులు మార్చడాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు టి.విజయమ్మ, గడ్డం నరసింహ, యూనియన్ నాయకులు యు.రత్నకుమారి, ఎం.లక్ష్మీకాంతం, పి.కోటేశ్వరి, బి.బుల్లెమ్మ, డి.అంకమ్మ, పి.సుభాషిణి, భారతి, రజనీకాంత్, యేసు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరపాలక సంస్థను ముట్టడించిన పారిశుధ్య కార్మికులు
కమిషన్ చాంబర్ ముందు బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు
వేధింపులు, కక్ష సాధింపులు అధికమయ్యాయని సీఐటీయూ నేతల ధ్వజం
చంద్రబాబు పాలనలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని డిమాండ్
చెత్త రాజకీయాలు ఆపండి


