కానిస్టేబుళ్లే పోలీసు శాఖకు వెన్నెముక
ఒంగోలు టౌన్: పోలీసు శాఖకు కానిస్టేబుళ్లు వెన్నెముక లాంటి వారని, శాంతి భద్రతల పరిరక్షణ కానిస్టేబుళ్ల భుజస్కంధాల మీదనే ఆధారపడి ఉంటుందని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు కొత్తగా ఎంపికై న పోలీసు కానిస్టేబుళ్లకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తొమ్మిది నెలలపాటు పొందే శిక్షణలో శారీరక దృఢత్వం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన వారు వృత్తిలో సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సానుకూల ఆలోచనలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుకోవాలని, ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని చెప్పారు. ఉత్తమమైన శిక్షణతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ నెల 22 నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యక్రమం తరహాలో..
జిల్లాకు ఎంపికై న 281 మంది కానిస్టేబుళ్లలో సివిల్ విభాగంలో పురుష అభ్యర్థులు 88 మంది, మహిళలు 38 మంది, అలాగే ఏపీఎస్పీ విభాగంలో 155 మంది ఉన్నారు. వీరిని మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్‌కు తరలించారు. అభ్యర్థుల వెంట కుటుంబ సభ్యులు సైతం ఉండటంతో మొత్తం 20 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అయితే కొత్త కానిస్టేబుళ్లను తరలించే బస్సులకు యువగళం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను పార్టీ వ్యవహారంలా మార్చడం నైతికంగా సమర్థనీయం కాదని ప్రజా సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యువగళం ఫ్లెక్సీ మీద సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రాలను ముద్రించి, హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ఫొటో వదిలేయడం గమనార్హం. కానిస్టేబుల్ అభ్యర్థులను పల్లె వెలుగు బస్సుల్లో మంగళగిరికి తరలించడంపై కొందరు తలిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.


