హైవేపై ప్రమాదాల కట్టడికి చర్యలు
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
మద్దిపాడు: జాతీయ రహదారిపై ప్రమాదాలను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఫ్యాక్టరీల్లో పనులకు వెళ్లి వచ్చేవారితో గ్రోత్ సెంటర్ ప్రాంతం రద్దీగా ఉండటం, కూలీలు ప్రమాదకర పరిస్థితిలో రోడ్డు దాటుతుండటాన్ని గమనించారు. జాతీయ రహదారిపై మహిళలు చేయెత్తినా బస్సు ఆగకపోవడంతో రోడ్డుపైకి వచ్చి మరీ బస్సులను నిలుపుదల చేయడాన్ని ఎస్పీ గమనించి వారితో కాసేపు మాట్లాడారు. గ్రోత్ సెంటర్ వద్ద బస్సులు ఆపడం లేదని, అదేమంటే ఫ్రీ బస్సు కాదంటున్నారని సమస్యను ఎస్పీకి వివరించారు. దీంతో ఆయన ఆర్టీసీ ఆర్‌ఎంకు ఫోన్ చేసి గ్రోత్ సెంటర్ వద్ద బస్ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అప్పటికప్పుడే గ్రోత్ సెంటర్ ముందు భాగంలో బస్సు నిలిపేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. స్టాపింగ్ పాయింట్‌లో బస్సులు ఆగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ రాజాబాబుకు ఫోన్ చేసి సమస్యను వివరిస్తూ ఉండగా.. జాతీయ రహదారిపై గుంటూరు వైపు వెళ్తున్న ఆయన గ్రోత్ సెంటర్ వద్ద ఆగి ఎస్పీతో మాట్లాడారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కలెక్టర్‌కు ఎస్పీ వివరించారు. అనంతరం జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి ఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, మీ కుటుంబాలు ఎంతో ఆశగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి తప్పిదంగా పరిగణించి వదిలేస్తున్నామని, మరో మారు జాతీయ రహదారిపైకి హెల్మెట్ లేకుండా రావద్దని వాహనదారులకు స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ, మద్దిపాడు ఎస్‌ఐ వెంకట సూర్య, స్పెషల్ పార్టీ పోలీసులు, పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
హైవేపై ప్రమాదాల కట్టడికి చర్యలు


