ఖాళీ బిందెలతో మహిళల నిరసన
కనిగిరిరూరల్: మంచినీటి సమస్యలపై స్థానిక పదో వార్డు 6వ సచివాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పదో వార్డులోని కంది పప్పు మిల్లు వీధి, ప్రధాన వీధులకు కొన్ని రోజులుగా నీళ్లు రావడం లేదన్నారు. ఇటీవల డీప్ బోర్‌వెల్ మరమ్మతులు చేసినా కుళాయిలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో నీటి కోసం వార్డు ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నామన్నారు. సచివాలయ ఎమ్యునిటీ అధికారి ఇన్‌చార్జి కావడంతో వార్డులోని నీటి సమస్యను పట్టించుకోవడం లేదని మహిళలు అరోపించారు. అనంతరం సచివాలయ అధికారులకు వినతిపత్రం అందచేశారు.
టంగుటూరు: బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్‌కుమార్ అన్నారు. బాల్య వివాహాల విముక్తి భారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని బి.నిడమానూరు కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్న వయసులోనే వివాహాలు చేస్తే పిల్లల అమూల్యమైన జీవితం నాశనం అవుతుందన్నారు. బాలిక ఇంటికి భారమనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారని, ఇటువంటి అపోహల నుంచి విద్యార్థులు బయటకు రావాలని సూచించారు. ప్రతి బాలిక అభివృద్ధి చెందుతే కుటుంబ వ్యవస్థ, సమాజం అభివృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టంగుటూరు, సింగరాయకొండ ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: గంజాయికి అడ్డాగా మారిన చీమకుర్తిపై పోలీసులు దృష్టి సారించారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని జీఎల్‌పురం గ్రామం ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న నాగలూరి మార్తమ్మ అనే మహిళను గురువారం అదుపులోనికి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న 1.850 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ముగ్గురు వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు మార్తమ్మ తెలిపింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన


