శాపం కాకూడదు.!
వరం కావాలి..
● మార్కాపురం జిల్లాపై వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: కొత్తగా ఏర్పడబోతున్న మార్కాపురం జిల్లా ప్రజలకు ఒక వరంగా ఉండాలని, శాపం కాకూడదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గురువారం మార్కాపురంలో దళిత సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తనను వలస నేతగా విమర్శించడంపై ఆయన స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ తనపై దళిత నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. తాను వలస నేతను కాదని, ప్రకాశం బిడ్డనని స్పష్టం చేశారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఒక బహుమానంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్న ఉద్దేశంతో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. పశ్చిమ ప్రకాశంలో బహుజనులు, గిరిజనులు, మధ్యతరగతి కుటుంబీకులు, వెనుకబడిన తరగతులకు చెందినవారు, మైనార్టీ లు, అన్ని వర్గాలకు చెందిన వారిలో అత్యంత పేద కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. వారి అభ్యున్నతికి కొత్తగా ఏర్పడనున్న జిల్లా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయ నాయకులకు కొమ్ముకాయడం మానుకుని వాస్తవాలు విశ్లేశించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఏర్పడబోతున్న జిల్లాల్లో మార్కాపురం జిల్లా అత్యంత వెనుకబడిందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. చంద్రశేఖర్‌కు ఏం తెలుసు అనే మేధావులు.. కొత్త జిల్లాకు ఆర్థిక పురోగతి అవసరమా, కాదా అనే విషయాన్ని గుండెలపై చేయివేసుకుని ఆలోచించాలని అన్నారు. ఆర్థిక వనరులులేని ఈ ప్రాంతంలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ సాగు, తాగునీటి అవసరాల కోసం అనేక గ్రామాలు అలమటిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత తక్కువ ధరకు అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యవసాయ అధారిత ఫ్యాక్టరీలు, కంపెనీలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మూడు రాష్ట్రాలకు రవాణా వ్యవస్థలు కలిగిన ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు హక్కుగా రావాలే తప్ప.. మరే ఇతర మార్గాలలో రావన్న సత్యాన్ని గమనించాలని కోరారు. తాను సంపూర్ణ అవగాహనతో ప్రజాప్రతినిధిగా పశ్చిమ ప్రాంత ప్రజలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో కొత్తగా ఏర్పడబోతున్న జిల్లా పరిస్థితులపై మాట్లాడుతున్నానని తెలిపారు. దళిత కార్డులు ఉపయోగించుకుని మీతో మాట్లాడిస్తున్న నేతలను ప్రశ్నించండని, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా గెజిట్ ప్రకారం మేలు ఏంటో, కీడు ఏంటో బహిరంగంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో మాట్లాడించండని అన్నారు. జీవిత కాలం అత్యంత పేద జిల్లాగా మార్కాపురాన్ని మార్చే కుట్రను గ్రహించాలని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్కాపురం ఒక అడ్డాగా మారి వెనుకబడిన తరగతులకు, పేదలకు అందని ద్రాక్షగా తయారైందన్నారు. కొంతమంది కబంధ హస్తాలలో బిగించబడటాన్ని గ్రహించాలని, చౌకబారు వ్యాఖ్యలుమాని ఈ ప్రాంతాభివృద్ధి కోసం పోరాటం చేయాలని తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు. పేదల బిడ్డల కోసం, పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేసిన టీడీపీ నాయకులకు మార్కాపురం గురించి మాట్లేడే నైతిక హక్కు లేదన్నారు. మిర్చి యార్డ్ ఏర్పాటు గురించి మాట్లాడలేని వారికి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. ఇండస్ట్రియల్ హబ్‌గా ఉన్న దొనకొండ, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలంను వదులుకుని చంద్రబాబు కంబంధ హస్తాలలో బంధించబడిన టీడీపీ ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్యం ఈ జిల్లాకు శాపంగా మారబోతుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.


