రేపు నవోదయ ప్రవేశ పరీక్ష
ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ పరీక్ష నిర్వహించనున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సి.శివరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 25 కేంద్రాల్లో 5,502 మంది విద్యార్థులకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ప్రవేశ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
ఒంగోలు: అండర్–12 బాలుర జిల్లా క్రికెట్ జట్టును ఈ నెల 13వ తేదీ స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్‌లో ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రస్, షూ, సొంత కిట్‌తో హాజరుకావాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ వెంట తీసుకురావాలన్నారు. 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే ఎంపికకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పూర్తి వివరాలకు కోచ్‌ల మొబైల్ నంబర్లు 9701022333, 9246222999ను సంప్రదించాలని నాగేశ్వరరావు సూచించారు.
ఒంగోలు: జాతీయస్థాయి 40వ తైక్వాండో చాంపియన్‌షిప్‌ను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు కోచ్, తైక్వాండో 5వ డాన్ షేక్ కరిముల్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనదలచిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. తద్వారా విజయవాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కరిముల్లా సూచించారు.
● జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి
ఒంగోలు: కక్షిదారులు ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ చైర్‌పర్సన్ టి.రాజ్యలక్ష్మి కోరారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ఆమె వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా వ్యాజ్యాలు, అన్ని రకాల బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రీ లిటిగేషన్ స్థాయిలో కూడా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ కేసులు, ట్రాఫిక్ కేసులు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం నిమిత్తం 29 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రీ సిట్టింగ్‌ల ద్వారా ఇప్పటికే 15,150 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. దీనివల్ల కేసులు వేగవంతంగా పరిష్కరించుకునే సౌల భ్యం ఉందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యలక్ష్మి కోరారు.
ఒంగోలు వన్‌టౌన్: దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనం 2026 ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులోని సమితి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులపై ఆగ్రకుల దాడులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరును నిర్ణయించాలని కోరారు. యాదవ నాయకులు జాజుల శ్రీనివాస యాదవ్, కుట్టుబోయిన కోటియాదవ్, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


