మార్కాపురం జిల్లాలో దర్శిని కలపాలి
● డీఆర్‌ఓకు వినతిపత్రం అందించిన జంకె
మార్కాపురం:
నూతనంగా ఏర్పాటు చేయనున్న మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి బుధవారం ఒంగోలులో డీఆర్‌ఓకు వినతిపత్రం అందచేశారు. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలను కలిపి పశ్చిమ ప్రకాశంగా పిలుస్తారని, అలాంటి దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలులో కలపడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలతో పాటు విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు, రాజకీయపార్టీల ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల వారు సైతం దర్శిని మార్కాపురంలో కలపాలని కోరుతున్నారన్నారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు నియోజకవర్గ ప్రాంతాలు సారూప్యతను కలిగి ఉన్నాయన్నారు. ఇందుకు భిన్నంగా మార్కాపురం జిల్లాలో దర్శిని మినహాయించడం మంచిది కాదన్నారు. దర్శి లేకుండా జిల్లా ఏర్పాటు చేయడం అసంబద్ధగా, అసమతుల్యంగా అన్యాయంగా ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మార్కాపురం పట్టణానికి దగ్గరగా దొనకొండ, కురిచేడు మండలాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి దర్శిని మార్కాపురం నియోజకవర్గంలో కలపాలని కోరారు. 2022లో జిల్లా పునర్‌వ్యవస్ధీకరణలో భాగంగా మార్కాపురంను జిల్లా చేయాలని వినతిపత్రాలు అందించామని జంకె పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పరిశీలించి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన కోరారు. ఈయన వెంట పార్టీ నాయకులు ధర్మానాయక్, మందటి శివారెడ్డి తదితరులు ఉన్నారు.


