శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా
● గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
సింగరాయకొండ: జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గంజాయి రవాణా, విక్రయాలు, నియంత్రణ, నేరాల నియంత్రణ, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, కీలక కేసుల పురోగతిపై ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజుతో కలిసి సమీక్షించారు. ఐజీ మాట్లాడుతూ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యం ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించి నిందితులకు చట్టపర శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌ను సందర్శించే బాధితులకు నమ్మకం, ధైర్యాన్ని కల్పించేలా ప్రతి కేసునూ పోలీసు అధికారులు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐలు సీహెచ్ హజరత్తయ్య, నాగరాజు, రామారావు, ప్రసాద్, రాజేష్‌కుమార్, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు.


