కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రైవేటీకరణ
మద్దిపాడు: కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే చంద్రబాబు వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని నేలటూరులో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 కళాశాలను మంజూరు చేయించారని, వాటిలో 7 కళాశాలలను పూర్తి చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించారన్నారు. మిగిలిన 10 కళాశాలలు నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పీపీపీ విధానంలో తన అనుయాయులైన కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. దోచుకో దాచుకో అన్న చందంగా ప్రభుత్వం పనితీరు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం పట్టని చంద్రబాబు ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా నోరు విప్పడం లేదన్నారు. కిందిస్థాయి నాయకులు ఇసుక, గ్రావెల్ అక్రమ ఇష్టం వచ్చినట్లు అక్రమ రవాణా చేస్తూ అక్రమంగా దోచేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ టూ తాడేపల్లి ఫ్‌లైట్లలో చేసిన షటిల్ సర్వీసు ఖర్చులో ఒక భాగం వైద్యశాలలకు ఖర్చు చేస్తే 17 మెడికల్ కళాశాలలు పూర్తయ్యేవని అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 18 నెలల కాల వ్యవధిలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. ప్రజలు తిరగబడతారన్న భయంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ప్రశ్నించిన వారి గొంతు నొక్కడం, వారిపై దాడులు చేయించడం, అక్రమంగా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని మేకను కుక్క అని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు పాకనాటి మహానందరెడ్డి, కందుల డానియేల్, నాదెండ్ల మహేష్, గద్దె జాలయ్య, అచ్యుత్, డి.శ్రీనివాస్, యోగేశ్వరరావు, మాలే శ్రీనివాసరెడ్డి, కె.నరసింహారెడ్డి, డి.కృష్ణారెడ్డి, వి.వెంకటేశ్వరరెడ్డి, గజేంద్ర పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
పేదలకు వైద్యం దూరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
మాజీ మంత్రి మేరుగు నాగార్జున


