పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసు నమోదు

Dec 9 2025 7:06 AM | Updated on Dec 9 2025 7:06 AM

పోక్సో కేసు నమోదు

పోక్సో కేసు నమోదు

పోక్సో కేసు నమోదు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మినీలారీ

దర్శి: బాలికను నమ్మించి మోసం చేయగా..ఆత్మహత్య చేసుకున్న కేసులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై మురళీ తెలిపిన వివరాల మేరకు..జముకులదిన్నె గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా గర్భిణి అని తేలింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన నరేంద్ర వల్ల గర్భిణి అయిందని అనుమానంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన బాలిక మృతి చెందగా ఈ కేసు విషయాలు ఇప్పటికీ బయటకు రాకపోవడం గమనార్హం. కేసు విషయంలో ప్రతిరోజు బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

పొన్నలూరు: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రావుకొల్లులో సోమవారం జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు మేరకు..గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసరి ప్రశాంత్‌(18) నరసరావుపేటలోని ప్రైవేట్‌ కళాశాల్లో పాలిటెక్నిక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇటీవల కళాశాల నుంచి ఇంటికి వచ్చి గ్రామంలో ఉంటున్నాడు. అయితే కుటుంబసభ్యులు కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో సోమవారం తప్పకుండా వెళ్తానని చెప్పి గ్రామంలోని అతని తాత వాళ్ల ఇంటి దగ్గర నిద్రించడానికి ఆదివారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ మృతి

బేస్తవారిపేట: మడ్డీ ఆయిల్‌ ట్యాంకర్‌ను మినీలారీ ఢీకొట్టిన సంఘటన మండలంలోని పెంచికలపాడు సమీపంలో సోమవారం జరిగింది. ఈ సంఘటన ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డు చోటు చేసుకుంది. అనంతపురం నుంచి టమోటా బాక్స్‌ల లోడుతో మినీలారీ వైజాగ్‌ వెళ్తుంది. పెంచికలపాడు సమీపంలోకి వచ్చే సమయానికి టైర్‌ పేలింది. అదే సమయంలో ఎదురుగా రాజమండ్రి నుంచి తాడిపత్రికి సిమెంట్‌ ఫ్యాక్టరీకి మడ్డీ ఆయిల్‌ ట్యాంకర్‌ వాహనం వెళ్తుంది. టైర్‌ పేలి అదుపుతప్పిన టమోటా లోడు లారీ ఆయిల్‌ ట్యాంకర్‌ వాహనాన్ని ముందు వైపు ఢీకొట్టి రోడ్డు పక్కన బోల్తాపడింది. రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంకర్‌ వాహనంలో ఉన్న డ్రైవర్‌ పైడికొండల దుర్గారావు పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. మృతుడు వెస్ట్‌ గోదావరి జిల్లా దేవరపల్లెకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మినీలారీ డ్రైవర్‌ కుంపటి ఆదిశేషయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దుర్గారావు మృతదేహం మంటల్లో మాడిపోయి గుర్తుపట్టలేని విధంగా మాడిపోయింది. మంటల్లో చిక్కుకున్న ఆయిల్‌ ట్యాంకర్‌ పేలే అవకాశం ఉండటంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు గంటన్నర పాటు నిలిచిపోయాయి. గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్‌ జితేంద్రకుమార్‌ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement