ఎమ్మెల్యే కార్యాలయం నుంచే మెప్మా అవినీతి
● వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ: మెప్మాలో అవినీతి అక్రమాలన్నీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యాలయం నుంచే జరిగినట్లు ఆరోపణలున్నాయని, ఈ విషయంలో ఎమ్మెల్యే దామచర్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన మెప్మాలో ఒంగోలులో జరిగిన అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోందన్నారు. 39 గ్రూపుల్లో అధికారికంగా అవినీతి జరిగినట్లు తెలుస్తోందన్నారు. 200కుపైగా ఫేక్ గ్రూపులతో నిధులు కాజేశారని వార్తలు వస్తున్నాయని తెలిపారు. అవగాహన లేని ఎస్టీలతో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి వెయ్యి లేదా రెండు వేలు ఇచ్చి వారి పేర్ల మీద లోన్లు ఇచ్చి డ్రా చేసినట్లు నిర్ధారణ అవుతోందన్నారు. ‘మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు.. మా వెనకాల పార్టీ ఉంది, ఇలాంటివి చాలా చూశాం’ అంటూ అవినీతి అక్రమాలకు పాల్పడిన రిసోర్సుపర్సన్ మాట్లాడుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 2021 నుంచి ఈ రోజు వరకు గ్రూపుల్లో ఎవరైతే బినామీలుగా రుణాలు తీసుకున్నారో.. వారందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులు జనసేన, టీడీపీలలో ఏ పార్టీ వారయినా అందరూ మీ దగ్గరే ఉన్నారన్నారు. ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిని అవినీతిగా చూడాలన్నారు. ఎమ్మెల్యే రెండు వారాల్లో కమిటీ వేసి విచారణ పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేస్తామన్నారని, జేసీ కమిటీ విచారణ చేస్తున్నారని చెప్పారని, రెండు వారాలుగా అసలు ఏం జరిగిందో నివేదిక ఇవ్వగలరా.? అని ప్రశ్నించారు. ఎందుకంటే మీ విచారణపై మాకు నమ్మకం లేదని రవిబాబు అన్నారు. గతంలో చాల చెప్పారని, కొణిజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తామన్నారని, రియల్ ఎస్టేట్‌లో మట్టి గురించి విచారణ చేస్తున్నామని చెప్పారని, కానీ, ఆ తర్వాత సిట్ విచారణ చేసి భూములు అప్పగిస్తామని చెప్పారని, కబ్జాకోరుల నుంచి ఎవరి భూములు వారికి అప్పగిస్తామని చెప్పారని, అయితే, అవేమీ పరిష్కారం కాలేదనీ రవిబాబు గుర్తుచేశారు. మెప్మాలో అవినీతి విషయంలోనైనా ఎమ్మెల్యే కార్యాలయంవైపు వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే దామచర్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేకుంటే అవినీతి అక్రమాలపై ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని రవిబాబు హెచ్చరించారు.


