హైవేపై విద్యార్థుల ధర్నా
బేస్తవారిపేట: ఆర్టీసీ బస్ సమయం మార్చారని, కనిగిరి డిపో బస్‌లలో ఎక్కించుకోవడం లేదని విద్యార్థినీ, విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా చేసిన సంఘటన సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగింది. బేస్తవారిపేట జెడ్పీ బాలికల, జెడ్పీ బాలుర హైస్కూల్స్‌లో రెట్లపల్లె, పెద్ద ఓబినేనిపల్లె, చిన్న ఓబినేనిపల్లె, సలకలవీడు గ్రామాలకు చెందిన 35 మంది విద్యార్థినిలు, 20 మంది బాలురు చదువుకుంటున్నారు. సాయంత్రం 5–5.30 గంటల సమయంలో గొల్లపల్లెకు వెళ్లే బస్‌లో ప్రతిరోజు వెళ్తున్నారు. నెల రోజులుగా రాత్రి 6.30 – 7 గంటల సమయంలో ఈ బస్ వస్తుండటంతో హైవే రోడ్డుపై దిగి చిన్న ఓబినేనిపల్లె, సలకలవీడుకు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికరంగా మారిందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. కనిగిరి డిపో బస్‌లలో ఎక్కనివ్వడంలేదని, హేళనగా మాట్లాడుతున్నారని విద్యార్థినిలు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో కనీసం బస్‌షెల్టర్ లేకపోవడంతో దుకాణాల ముందు గంటల తరబడి కూర్చోవాల్సిన పరిస్థితి, లేదంటే హైవేపై నిలబడాల్సి దుస్థితి ఉందని బాలికలు వాపోయారు. పెంచికలపాడు వద్ద జరిగిన యాక్సిడెంట్ వద్దకు వెళ్తున్న మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు విద్యార్థుల ధర్నాను గమనించి అక్కడకు చేరారు. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని హైవేరోడ్డుపై ధర్నాలు చేయకూడదని ధర్నాను విరమింపచేశారు. నిత్యం బాలికల అవస్థలు బస్టాండ్‌లో చూస్తున్నామని, రాత్రి 7 గంటల వరకు బస్ రాకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటోందని స్థానికులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.


