ఒంగోలు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
● నళిని పోస్టుమార్టం వద్ద దళిత సంఘాల ఆందోళన
ఒంగోలు సిటీ: ఎంటెక్ విద్యార్థిని మైరాల నళిని ఆత్మహత్య ఘటనపై ఒంగోలు జీజీహెచ్ వద్ద దళిత సంఘాలు, పోలీసుల మధ్య సోమవారం ఉద్రిక్తత నెలకొంది. నళిని ఆత్మహత్య చేసుకుంటే.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ పోస్టుమార్టం సమయంలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో జీజీహెచ్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కబాడీపాలేనికి చెందిన ఎంటెక్ విద్యార్థిని మైరాల నళిని – స్థానిక మహేంద్ర నగర్‌కు చెందిన సింగోతు శ్రీనివాస్ గత పదేళ్లుగా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని నళిని కోరుతుంది. కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని శ్రీనివాస్ తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురై గత శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది. తాను ఏ విధంగా మోసపోయిందనే విషయాన్ని సూసైడ్ నోట్‌లో వివరంగా రాసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఒత్తిడితో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకుడు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. తొలుత కేసు మార్చేందుకు పోలీసులు అంగీకరించకుండా మొండికేశారు. దళిత సంఘాల ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా మార్చారు. అనంతరం నళిని మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆందోళనలో మాజీ కౌన్సిలర్ కట్ట సుధాకర్, మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ కుమార్, ముప్పవరపు గోపి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.


