అందని పుస్తకం
కావాల్సిన పుస్తకాలు..
మార్కాపురం:
ఆధునిక దేవాలయాలుగా పేరుబడిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లేకపోవడంతో అటు పాఠకులు, ఇటు నిరుద్యోగుల ఆదరణ కరువై నిర్వీర్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాల కొనుగోలుకు అనుమతి లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల మనుగడకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 66 గ్రంథాలయాలు ఉన్నాయి. ఒంగోలు, మార్కాపురంలో గ్రేడ్ 1 గ్రంథాలయాలు ఉండగా, గ్రేడ్ 2 గ్రంథాలయాలు కంభం, కనిగిరి, పర్చూరు, చీరాలలో ఉన్నాయి. మిగిలినవి గ్రేడ్ 3 గ్రంథాలయాలు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 66 గ్రంథాలయాల్లో 25 చోట్ల మాత్రమే సొంత భవనాలు ఉండగా మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పుస్తకాల కొనుగోలు లేకపోవడంతో 2023 నాటి పుస్తకాలే పాఠకులకు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అందుబాటులో ఉండటంతో వారు గ్రంథాలయాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. గడచిన రెండేళ్లకాలంలో క్రీడలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారాయి. అన్ని రంగాల్లో కరెంట్ అఫైర్స్ మారిపోయాయి. వీటన్నింటితో కూడిన పుస్తకాలు టెట్, డీఎస్సీతోపాటు బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలు రాసేవారికి ఎకానమీ, హిస్టరీ, పొలిటికల్ సైన్సు అండ్ టెక్నాలజీ, కరెంటు అఫైర్స్ పుస్తకాలు అవసరం. అయితే గ్రంథాలయాల్లో పాత పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరుద్యోగ అభ్యర్థులకు అప్డేట్ కరెంటు అఫైర్స్ అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చి నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఈనెల, వచ్చే నెలలో టెట్‌తోపాటు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ప్రైవేటు లైబ్రరీలకు వెళ్లి చదువుకుంటున్నారు. మరికొంతమంది పాత పుస్తకాలనే ఆశ్రయిస్తున్నారు.
ఉద్యోగుల ఖాళీలు..
జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ శాఖలో 105 మంది వివిధ విభాగాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 30 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు 85 ఖాళీలు ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్స్ విభాగంలో 11 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పార్ట్‌టైమ్ వర్కర్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో ఉన్న విలేజ్ లైబ్రరీల్లో 26 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 6,06,607 పుస్తకాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న 66 గ్రంథాలయాల్లో 70,659 మంది సభ్యులు ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
గ్రూప్స్, డీఎస్సీ, టెట్‌లు, బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించి సోషియాలజీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరంట్ అఫైర్స్, జనరల్ సైన్సు, స్పోర్ట్స్ తదితర విభాగాలకు చెందిన తాజా సమాచారంతో ఉన్న పుస్తకాలు అవసరం. వీటిని గ్రంథాలయాల్లో ఉంచితే పాఠకులు పెరగడంతోపాటు నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.


