ప్రభుత్వ ఆస్పత్రులు లేకుంటే పేదల పరిస్థితేంటి..?
పీపీపీతో పేదలకు వైద్యం దూరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు
ఒంగోలు టౌన్: నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేకుండా చేయడం వలన పేదలకు ఉచితంగా అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. బీసీ సెల్ నగర అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద సామాన్య ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని తెలిపారు. 5 మెడికల్ కాలేజీలను నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పాలనలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. సొంత వ్యక్తులకు మేలు చేయడానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకనని, లేకపోతే ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేయాలని ఎందుకు ప్రయత్నిస్తారన్నారు. పేదల పిల్లలు డాక్టర్ చదువులు చదవకుండా మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారని ప్రశ్నించారు. ప్రజానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా జననేత జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దారని, రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా అందించేలా చేశారని తెలిపారు. జగనన్న పాలన మళ్లీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జగనన్న సురక్ష పథకం ద్వారా ఇంటి వద్దకే స్పెషాలిటీ వైద్యం అందించారన్నారు. నిరుపేద ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ప్రజలు ఉల్లాసంగా పాల్గొంటున్నారని, మహిళలు చంద్రబాబు పాలన పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 16వ తేదీ వైఎస్సార్ సీపీ సేకరించిన కోటి సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజేష్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, సుబ్బారావు, శ్రీను, జానీ, బొప్పరాజు జ్యోతి, అఫ్సర్ బేగం, బడుగు ఇందిర, మేరి, రాధిక, సుబ్బులు, రజని, వేముల శ్రీకాంత్, సాయి, నవీన్, మణికంఠ, నాని, యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు.


