ఎరిక్షన్‌ బాబువి అవినీతి రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

ఎరిక్షన్‌ బాబువి అవినీతి రాజకీయాలు

Dec 8 2025 7:44 AM | Updated on Dec 8 2025 7:44 AM

ఎరిక్షన్‌ బాబువి అవినీతి రాజకీయాలు

ఎరిక్షన్‌ బాబువి అవినీతి రాజకీయాలు

టీడీపీని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నావు నియోజకవర్గంలో ఉన్నంత అవినీతి మరెక్కడా లేదు టీడీపీ ఇన్‌చార్జి అండ చూసుకొని పోలీసులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఉపాధి కూలీలను సైతం దోచుకుంటున్నారు టీడీపీ నాయకుడు, టెక్నాలజీ కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మన్నె రవీంద్ర, త్రిసభ్య కమిటీ మాజీ సభ్యుడు అంబటి వీరారెడ్డి

యర్రగొండపాలెం: టీడీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుపై సొంత పార్టీ వారే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన చేసిన, చేస్తున్న అవినీతి బాగోతాన్ని ఎండగట్టారు. అధికారులు, పోలీసులు, తన పార్టీ భజన నాయకులతో ఆనందంగా పుట్టిన రోజు పార్టీ చేసుకున్న ఎరిక్షన్‌బాబుకు కునుకులేకుండా చేశారు. స్థానిక ఉదయ్‌–రవీంద్ర మల్టీస్పెషాలిటీ వైద్యశాలలో ఆదివారం టీడీపీలో ఉన్న వర్గీయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న టెక్నాలజీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర, టీడీపీ త్రిసభ్య కమిటీ మాజీ సభ్యుడు అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తమతోపాటు కార్యకర్తలు కష్టించి పనిచేశారన్నారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి వచ్చిన ఎంపీ మనుషులను తరిమేశావని, నీవు చేసిన తప్పిదాలతోనే ఓడిపోయి ఆ నిందను తమపై వేస్తున్నావని ఎరిక్షన్‌బాబుపై మండిపడ్డారు. అధికారం ఉందని ఇసుక, బియ్యం, మద్యం, మట్టి రవాణాచేసే అక్రమార్కులను పెట్టుకొని బ్రోకర్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి జిల్లాలో మరెక్కడాలేదని, ఈ విషయం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తన మనుషులను పెట్టుకొని మామూళ్లు వసూలు చేసుకుంటున్నావని, రోజు కష్టపడితేనే కడుపు నింపుకునే ఉపాధి కూలీలను సైతం వదలడంలేదని వారు దుయ్యబట్టారు. ఎరిక్షన్‌బాబు అండ చూసుకొని పోలీసులు సైతం రెచ్చిపోతున్నారని, స్టేషన్‌లోనే పంచాయితీలు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని అన్నారు. తాము అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లు అనిపిస్తుందని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల కంటే ముందు ఎరిక్షన్‌బాబు డాక్టర్‌ను బతిమిలాడుకొని నియోజకవర్గంలో అడుగు పెట్టగలిగాడని, త్రిపురాంతకంలో బాలత్రిపుర సుందరి సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కమీషన్లకు పాల్పడుతున్నాడని టీడీపీ త్రిసభ్య కమిటీ మాజీ సభ్యుడు సభ్యుడు అంబటి వీరారెడ్డి విమర్శించారు. పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోటలో ఆంజనేయ స్వామి గుడి కట్టేందుకు కావలసిన ఇసుక టన్నుకు రూ.300 వసూలు చేయించారని ఆరోపించారు. ఇటీవల పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక అసంబద్ధంగా జరిగిందని, డబ్బులు ఇచ్చినవారికే ఆ పదవుల్లో కూర్చోపెట్టారని అన్నారు. అక్రమంగా రేషన్‌ దందాచేసే వారిని ప్రోత్సహించలేదా, వైపాలెం సెంటర్‌కు వస్తే ఆ విషయం రుజువు చేయిస్తామని సవాల్‌ విసిరారు. పార్టీని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు దండుకోవడంతోపాటు పార్టీలో వర్గ రాజకీయాలు నడుపుతూ టీడీపీని భూ స్థాపితం చేస్తున్నావు, నియోజకవర్గంలో ఉన్న నిజమైన కార్యకర్తలు, ప్రజలు నిన్ను వదలరన్నారు. త్వరలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ఈ కమీషన్ల పంచాయితీని ఆయన దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. సమావేశంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షులు షేక్‌.జిలాని, వెన్నా వెంకటరెడ్డి, నాయకులు పులుకూరి పిచ్చయ్య, పోతిరెడ్డి రమణారెడ్డి, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ ఖుద్దూస్‌, శ్రీనివాసరెడ్డి, రంగనాయకులు, మల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement