కేసుల పరిష్కారానికి పోలీసులు సహకరించాలి
● జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి
ఒంగోలు: వ్యాజ్యాల పరిష్కారానికి పోలీసు డిపార్టుమెంట్ సహకరించాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ టి.రాజ్యలక్ష్మి కోరారు. ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై శనివారం స్థానిక తన చాంబరులో జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షించారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసుల్లో కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేందుకు చొరవ చూపాలని సూచించారు. దీనిద్వారా కక్షిదారులకు వారి విలువైన సమయం, ధనం ఆదా అవుతుందని తెలిపారు. సివిల్ కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులు కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగిపొందవచ్చని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా పోలీసు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం న్యాయమూర్తులు, సభ్యులతో కూడిన బెంచ్‌లు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజావెంకటాద్రి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, సబ్ డివిజినల్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.


