యువకుడి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన పోలీసులు
మార్కాపురం రూరల్ (మార్కాపురం): కుటుంబ సమస్యల కారణంగా కనిగిరికి చెందిన వ్యక్తి మార్కాపురం రైల్వే ఫ్లయిఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా సకాలంలో మార్కాపురం రూరల్ పోలీసులు వచ్చి కాపాడిన సంఘటన శనివారం జరిగింది. రూరల్ ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరికి చెందిన 26 ఏళ్ల వ్యక్తి కుటుంబ సమస్యలతో శనివారం ఉదయం స్థానిక రాయవరం సమీపంలోని ఫ్లయిఓవరు బ్రిడ్జి వద్దకు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న వారు 112కు డయల్ చేసి సమాచారం అందించారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావులు ఆ వ్యక్తి వద్దకు వచ్చి అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని చెప్పారు. వ్యక్తి ప్రాణం కాపాడిన సీఐ, ఎస్సైలను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు.


