రోడ్డు ప్రమాదంలో బైకిస్టు దుర్మరణం
కురిచేడు: మండలంలోని పడమర గంగవరం గ్రామానికి చెందిన ఇందూరి వెంకటరెడ్డి (54) ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కిందపడి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమర గంగవరం గ్రామానికి చెంనని వెంకటరెడ్డి బంధువుల ఇరుముడి కార్యక్రమానికి పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేనికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. నూజెండ్ల మండలం సీతారామపురం దాటగానే గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో రోడ్డుపై పడ్డాడు. కుడికాలు విరిగి పక్కన పడింది. తలకు వెనుక వైపు బలమైన గాయం కావడంతో 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. క్షతగాత్రుడిని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. వెంకటరెడ్డి మృతివార్త తెలియగానే పడమర గంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


