వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!
ఒంగోలు సబర్బన్:
ఆ రోడ్డులో ప్రయాణమంటే నరకానికి మార్గం వేసుకున్నట్లే.. వందలకొద్దీ గోతులతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఆ రోడ్డులో ఎక్కువగా ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు తిరుగుతాయి. కానీ, రోడ్డు మాత్రం ఛిద్రమవడంతో ఈ రోడ్డుపై ప్రయాణించలేము బాబో అంటూ వాహనచోదకులు అల్లాడిపోతున్నారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా ఒంగోలు రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంతకు ఈ రోడ్డు ఎక్కడో లేదు.. ఒంగోలు నగరపాలక సంస్థకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నగరపాలక సంస్థ పరిధిలోని పెళ్లూరు పొలిమేర నుంచి మూడు కిలోమీటర్లలోనే ఉంది. అదే వాసేపల్లిపాడు గ్రామం. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో ఆ గ్రామస్తులు పడుతున్న రోడ్డు వెతలు అన్నీఇన్నీ కాకుండా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఒంగోలు నగరపాలక సంస్థకు కొత్తపట్నం మండలానికి మధ్యలో వాసేపల్లిపాడు గ్రామం ఉంది. ఈ గ్రామం రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోని టంగుటూరు మండలం పరిధిలో ఉంది. వాస్తవానికి వాసేపల్లిపాడు టంగుటూరు మండలానికి విసిరేసినట్లుగా ఉంటుంది. దీనికి దక్షిణం వైపున సంకువానికుంట గ్రామం ఉంటుంది. ఆ గ్రామం మాత్రం కొత్తపట్నం మండల పరిధిలోకి వస్తుంది. ఒంగోలుకు ఆనుకుని కొత్తపట్నం మండలం మధ్యలో ఉన్న వాసేపల్లిపాడును గతంలో రాజకీయ నాయకులు ఓట్ల లెక్కల్లో భాగంగా టంగుటూరు మండలంలో కలిపారు. వాస్తవానికి మండల కార్యాలయాల్లో పనులు ఉంటే తప్ప వాసేపల్లిపాడు గ్రామస్తులకు టంగుటూరుతో పనే ఉండదు. ఆ గ్రామస్తులు చిన్నాచితకా పనులన్నింటికీ ఒంగోలు రావాల్సిందే. వాసేపల్లిపాడు గ్రామం నుంచి పెళ్లూరు హైవే వరకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. కానీ, మండల కేంద్రమైన టంగుటూరు మాత్రం 20 కిలోమీటర్లకుపైనే ఉంటుంది.
గోతులమయంగా రోడ్డు...
వాసేపల్లిపాడు రోడ్డు గోతులమయంగా మారింది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్డు మొదలుకుని గ్రామంలోకి వెళ్లేంత వరకు ఈ రోడ్డు మరీ అధ్వానంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు వందల సంఖ్యలో గోతులు. ఆ రోడ్డుపై ప్రయాణమంటే ప్రాణం మీదకు వచ్చే విధంగా ఉంటుంది. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు ప్రయాణించే ఈ రోడ్డు ధ్వంసం అయినా పాలకులు పట్టించుకోవటం లేదు. పెళ్లూరు–వాసేపల్లిపాడు మధ్యలో ఉన్న ఈ రోడ్డు ప్రయాణానికి కష్టతరంగా మారింది. వాహనాల టైర్లకు పంక్చర్లు చేసేలా ఉందంటే ఈ రోడ్డు దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే గ్రామస్తులు రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయస్వామి ఒకసారి గ్రామంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.
రోడ్డును మూసేస్తున్న చిల్ల చెట్లు...
వాసేపల్లిపాడు రోడ్డు గోతులు, గొయ్యిలమయంగా మారటం ప్రయాణానికి ఒక రకంగా ప్రమాదమైతే.. ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లు మరీ ప్రమాదకరంగా మారాయి. కొన్ని చోట్ల చిల్లచెట్లు రోడ్డును పూర్తిగా మూసేశాయి. ఒకపక్క గోతులతో వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారితే.. మరోపక్క రోడ్డును మూసేసిన చిల్లచెట్ల వల్ల ఆ రోడ్డులో ప్రయాణం భయంభయంగా సాగుతోంది. రాత్రివేళ ప్రయాణమంటే తోడు లేకుండా ఒంటరిగా చేయడానికి గ్రామస్తులు వణికిపోతున్నారు. చెట్ల పొదల్లో మాటువేసి ఎవరైనా దాడులు చేసినా, అటకాయించినా ఆ రోడ్డులో తప్పించుకుని వేగంగా వెళ్లే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోని పాలకులు...
టంగుటూరు మండలానికి విసిరేసినట్లు ఉండే వాసేపల్లిపాడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు కొండపి నియోజకవర్గానికి చెందిన మంత్రి స్వామి పట్టించుకోడు. ఇటు ఒంగోలు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టించుకోడు. పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా కనీసం అధికారులైనా పట్టించుకుంటారా అంటే అదీ లేదు. గ్రామ సమస్యలపై నోరు మెదిపే అధికారులు కూడా కరువయ్యారు.
మంత్రి స్వామి నియోజకవర్గంలోని
రోడ్డు దుస్థితిపై ఆ గ్రామస్తుల ఆందోళన
ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే
దడపుడుతోందని ఆవేదన
ఒకటా.. రెండా.. వందలకొద్దీ గోతులు
ఆపై.. రోడ్డును కప్పేసిని చిల్లచెట్లు
ఆ రోడ్డుపై ప్రయాణమంటే నరకానికి మార్గమేనంటూ విమర్శలు
రాత్రివేళల్లో ప్రయాణమంటే ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిందే
జిల్లా కేంద్రమైన ఒంగోలును ఆనుకుని ఉన్నప్పటికీ పట్టించుకోని పాలకులు, అధికారులు
మంత్రి స్వామి చుట్టూ ప్రదక్షిణలు
చేసినా.. జనసేనకు ఓట్లేశారంటూ
దెప్పిపొడుపులు
వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!
వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!
వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!
వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!
వామ్మో.. వాసేపల్లిపాడు రోడ్డు..!


