గుర్తింపు లేని ఉద్యోగం..! | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు లేని ఉద్యోగం..!

Dec 6 2025 7:32 AM | Updated on Dec 6 2025 7:32 AM

గుర్తింపు లేని ఉద్యోగం..!

గుర్తింపు లేని ఉద్యోగం..!

జగన్‌ ప్రభుత్వంలో వేతనాల పెంపు...

ఒంగోలు టౌన్‌: పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు సమాన గుర్తింపు లభించడం లేదు. బందోబస్తులు, ట్రాఫిక్‌ డ్యూటీ, నైట్‌ బీట్లు తదితర విధులు నిర్వహిస్తున్నప్పటికీ శ్రమకు తగిన వేతనాలు, గుర్తింపు లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం భేఖాతరు చేస్తోంది. వేతనాలు, హోదా విషయంలో అంతులేని వివక్ష కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హోంగార్డులు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 6వ తేదీ హోంగార్డు రైజింగ్‌ డే నిర్వహించడం మినహా వారి భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలను ప్రకటించకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో 726 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. ఇందులో పురుష హోంగార్డులు 640 మంది మహిళా హోంగార్డులు సుమారు 86 మంది ఉన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, సభలు, సమావేశాలకు బందోబస్తు, నేరాల ఛేదించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో 35 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్నవారున్నారు. ఎలాంటి పదోన్నతులు లేకుండానే రిటైర్డ్‌ అయినవారున్నారు. రిటైర్డ్‌ అయ్యే రోజు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒట్టిచేతులతో రిటైర్డ్‌ కావడం జీవన సంధ్యలో ఆదుకునేవారు లేక అల్లాడిపోతున్నారు.

పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు...

రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరుగుతోంది. సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలో వుండడంతో వీరికి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఎన్టీఆర్‌ భరోసా కింద 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.4 వేల పింఛన్‌ వస్తుంది. కానీ, 35 ఏళ్లకుపైగా సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసినప్పటికీ హోంగార్డులకు మాత్రం పింఛన్‌ రాదు. పింఛన్‌ కోసం సచివాలయం వెళ్లి ఆఽన్‌లైన్లో ఆధార్‌ కార్డు నంబర్‌ కొట్టగానే ప్రభుత్వ ఉద్యోగిగా చూపుతోంది. దాంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. అరకొర వేతనాలతో పనిచేసే హోంగార్డుల పిల్లల చదువులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కాలర్‌షిప్పులు కూడా రావడంలేదు. పిల్లలను చదివించుకోడానికి అప్పులు చేయాల్సి వస్తోందని హోంగార్డులు వాపోతున్నారు.

దేశంలో తొలిసారిగా హోంగార్డు

కో ఆపరేటివ్‌ సొసైటీ...

2019లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలులో హోంగార్డుల సంక్షేమం కోసం కో ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా పిల్లల పెళ్లిళ్లు, చదువులకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరిగింది. తొలుత ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున 444 మందికి రుణాలిచ్చారు. ఆ తరువాత కొంతకాలానికి రుణపరిమితిని లక్ష రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు 353 మందికి లక్ష రూపాయల చొప్పున రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ సొసైటీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసలు పొందింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం

వేతనాలు ఇవ్వాలి...

హోంగార్డు రైజింగ్‌ డే సందర్భంగా తమకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు ఇవ్వాలని జిల్లాలోని హోంగార్డులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2015 సంవత్సరం నుంచి రావాల్సిన బకాయిలు మంజూరు చేయాలని, హోంగార్డులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయాలని, ఇతర న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హోంగార్డులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. రిక్రూట్‌మెంట్‌తో సంబంధం లేకుండా సీనియార్టీ ప్రకారం హోంగార్డులకు కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా

విధులు నిర్వర్తిస్తున్నా గుర్తింపునకు నోచుకోని హోంగార్డులు

ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించినా ఒకటే హోదా

సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నా పట్టించుకోని వైనం

కానిస్టేబుళ్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌

నేడు హోంగార్డుల దినోత్సవం

గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోంగార్డులకు వేతనాలను రూ.110 వరకు పెంచారు. అప్పటి వరకు రోజుకు రూ.600 వేతనం ఇస్తుండగా దాన్ని రూ.110కు పెంచి రూ.710 ఇచ్చింది. అంతేగాకుండా కానిస్టేబుల్‌ ఉద్యోగాలలో సివిల్‌ పోస్టులకు 15 శాతం, ఏపీఎస్పీ పోస్టులకు 25 శాతం కోటా ఇచ్చింది. దాంతో జిల్లా నుంచి 9 మంది హోంగార్డులు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. హోంగార్డులకు ఇంటి స్థలం ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి వేతనం పెంచలేదు. ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలుపుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement