కొణిజేడులో పీటీఎంకు హాజరుకాని తల్లిదండ్రులు
టంగుటూరు: మండలంలోని కొణిజేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. పాఠశాలలో 145 మంచి విద్యార్థులు ఉండగా కేవలం 60 మంది తల్లిదండ్రులు రావడంతో చేసేది ఏమీ లేక టీడీపీ నాయకులు, మండల అధికారులు, డ్వాక్రా మహిళలను తరలించి సమావేశం మమ అనిపించారు. కొణిజేడు టీడీపీలో రెండు వర్గాలు ఉండగా దామచర్ల సత్య వర్గం గైర్హాజరైంది. మంత్రి వద్ద మార్కులు పొందడం కోసం కార్యక్రమాన్ని రాజకీయ సభగా మార్చడంపై గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి 145 మంది పిల్లలు చదువుతుంటే 60 మంది తల్లిదండ్రులు రాగా దాదాపు 500 మంది ప్రజలు హాజరు కావడం, అందులో డ్వాక్రా మహిళలు ఉండటంతో రాజకీయ సభలా కనిపించింది. పాఠశాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలను రాజకీయ సభలుగా మార్చొద్దని ప్రజలు హితవు పలుకుతున్నారు. మరోపక్క మంత్రి స్వామి స్వగ్రామం తూర్పునాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతుండగా 50 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కూడా తల్లిదండ్రుల సమావేశం ప్రారంభం కాలేదు.


