నిమ్మ రైతు కంట కన్నీరు
జిల్లాలో నిమ్మ రైతుకు కాలం కలిసి రావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. దిగజారిన ధరలు.. గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం వెరసి నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో సుమారు 7,185 ఎకరాల్లో నిమ్మసాగవుతుంది. కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగవుతుంది. అందులో ఎక్కువగా భాగం కనిగిరి నియోజకవర్గంలో 2600 ఎకరాల్లో సాగుచేస్తున్నారు.
దిగజారిన ధరలు..
పంటలకు తెగుళ్లు ఆశించి, దిగుబడి సరిగ్గా రాక.. వచ్చిన పంటకు ఆశించిన ధరలు లేక ఓ ఏడాది.. ఈ ఏడాది రైతుకు మంచి దిగుబడులు వచ్చినా.. ఎగుమతుల్లేక పాతాళంలోకి ధరలు దిగజారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కార్తీక మాసంలో.. ప్రస్తుత కాలంలో నిమ్మ కాయలకు బయట మార్కెట్‌లో ధరలు ఉన్నా.. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. పంటల దిగుబడి పెరగడంతో ధరలు లేవని కమీషన్ ఏజెంట్లు కూడా నిమ్మ కాయలను కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుబడులు
జిల్లాలో అత్యధికంగా కనిగిరి, చినారికట్ల జంక్షన్ మార్కెట్ నుంచి.. గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి నిమ్మ కాయలు బయట మార్కెట్‌లకు ఎగుమతి అవుతుంటాయి. నిత్యం కనిగిరి నుంచి కనీసం 3 నుంచి 5 లారీల లోడ్‌ల నిమ్మ కాయల లారీలు ఇతర రాష్ట్రాలకు, ఇతర (ముంబాయి, చైన్నె, అహమ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర) ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని.. జిల్లాలోని, రాష్ట్రంలోని ఇతర నిమ్మ మార్కెట్ పాయింట్లలో కూడా ఎక్కువగా ఉత్పత్తులు ఉన్నందు వల్ల కనిగిరి మార్కెట్‌లో కాయలకు డిమాండ్ లేదని కమీషన్ వ్యాపారులు చెప్తున్నారు. దీంతో పండు కాయ రూ.2 నుంచి రూ.3కు, పచ్చికాయ గ్రేడ్ 1 రకం రూ.8 నుంచి రూ.10కి, గ్రేడ్ 2 రకం రూ.7 నుంచి రూ.8కి, గ్రేడ్ 3 రకం రూ.6 నుంచి రూ.7కు కొనుగోలు చేస్తున్నారు.
కూలీరాక..చెట్లపై వదిలేస్తూ..
రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిన రైతులు కనీస పెట్టుబడులు రాక లబోదిబోమంటున్నారు. గతేడాది సీజన్‌లో కాస్తో కూస్తో ధరలు దక్కిన రైతులు ఈ ఏడాది నిండా మునిగిపోయారు. రాష్ట్రంలో, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో దిగుబడులు రావడం.. చలి తీవ్రత పెరగడంతో ధరలు లేక రైతులు డీలా పడ్డారు. బస్తా కాయలు కోయడానికి దాదాపు 8 నుంచి 10 మంది కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో కూలీకి రూ.300 చెల్లించాలి. అంత చెల్లించి తీసుకెళ్లినా.. మార్కెట్‌లో కనీస కోత కూలీ రాకపోగా.. ఆటో ఖర్చు అదనపు భారంగా పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు చెట్టుమీదే కాయ కోత లేకుండా వదిలేస్తుండగా.. మరి కొందరు కాయ కోత కోయక పోతే రెండో ఏడాది చెట్టుకు పూత రాదనే భయంతో అదనపు ఖర్చుపెట్టి కాయను కోయించి పొలం గట్లపైనా.. రోడ్ల పైనే పారేస్తున్నారు. కొందరు రైతులు కోసిన కాయలను పొలాల్లో, ఇళ్లల్లో ఉంచుకోలేక.. కమీషన్ కొట్లకు కాయలు తెచ్చి వేస్తున్నారు. వచ్చిన కాడికి జమ అన్నట్లు కమీషన్ ఏజెంట్లు ఇచ్చినంత తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటున్నారు.. కమీషన్ ఏజెంట్లు గ్రేడ్ 1 రకం కాయలను మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో తెచ్చిన కాయలను కనిగిరి నుంచి తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక రోడ్లపైన పడేస్తున్నారు.


