
చెరబట్టారు..!
చెరువు భూములు
అధికారం అండగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు ఆక్రమించేశారు. పశువుల పోరంబోకు, డొంకపోరంబోకు ఇలా...
ఏ భూమినీ వదల్లేదు. ఇప్పుడు
ఏకంగా చెరువు భూములపై
కన్నేశారు. ఏం చేసినా అడిగేదెవరు అన్నట్లు చివరకు చెరువు భూములను వదలకుండా కబ్జా చేసి
ఆక్రమించేశారు. కబ్జా విషయం
అధికారులు తెలిసినా ఏం
తెలియనట్లు చోద్యం చూస్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్, ఒంగోలు: సింగరాయకొండ మండలంలో అతిపెద్దదైన మీడియం ఇరిగేషన్ చెరువు బింగినపల్లి చెరువు. సుమారు 650 ఎకరాల వైశ్యాలంలో చెరువు ఉంది. ఈ చెరువుకు ఆనుకుని పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 331లో 109 ఎకరాల వైశాల్యంలో అనచెరువు, సర్వే నంబర్ 327,330లలో సుమారు 30 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. బింగినపల్లి చెరువు కింద సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, అనకట్ట చెరువు కింద సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే బింగినపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత కన్ను ఈ చెరువుపై పడింది. గ్రామానికి చెందిన టీడీపీ నేత సన్నెబోయిన మాలకొండయ్య, మరో వ్యక్తి కలిసి పాతసింగరాయకొండ సర్వే నంబర్ 327, 330లో సుమారు 20 ఎకరాల ఇనాం భూములకు రిజిష్టర్ డాక్యుమెంట్ ఉందని సాకు చూపి ఇనాం భూములు 20 ఎకరాలతో పాటు బింగినపల్లి చెరువులో సుమారు 50 ఎకరాలు దున్ని తరువాత జామాయిల్ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పాతసింగరాయకొండ ఎస్సీ కాలనీవాసులు మా భూములు ఆక్రమిస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వెంటనే సిబ్బందిని పంపి టీడీపీ నేత మొక్కలు నాటడాన్ని ఆపించారు. దీంతో టీడీపీ నేత మాలకొండయ్య, అడ్వకేట్ రాజేష్‌తో పాటు పొలం హక్కుదారుడంటూ మక్కె కోటిరెడ్డి, మరొక వ్యక్తి వచ్చి తహశీల్దార్‌ను కలిసి రిజిష్టర్ పత్రాలు అందజేసారు. ఎస్సీలు మాత్రం అగ్రిమెంట్ పత్రాలు అందజేసారు.
చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు..
గత కొద్ది రోజులుగా బింగినపల్లి చెరువుతో పాటు పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని అనచెరువు కూడా ఆక్రమణకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాక ఆక్రమణదారులు చెరువు స్థలాన్ని ఆక్రమించటంతో పాటు జామాయిల్ వేస్తున్నారని, దీంతో చెరువు కింద సాగు చేసుకునే ఆయకట్టు దారులైన వరిరైతులకు సాగునీటి కష్టాలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనచెరువు ఆయకట్టు సుమారు 109 ఎకరాల వైశాల్యం ఉంటే ప్రస్తుతం కేవలం సుమారు 40 ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిన స్థలం ఆక్రమణకు గురైందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు ఆక్రమణకు గురవుతున్నా బింగినపల్లి చెరువు సాగు నీటి సంఘం అధ్యక్షుడు రోశిరెడ్డి కూడా పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి స్వామి ఇలాకాలో ఇటువంటి ఆక్రమణలు జరగటం సిగ్గుచేటని, టీడీపీ నాయకుని భూ దాహానికి అంతేలేదా అని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ భూ బకాసరుడు పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని ఇండస్ట్రీయల్ స్థలంలో పంట కాలువ ఆక్రమించాడని, జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో భూమిని సైతం ఆక్రమించాడని, ఇప్పుడు చెరువును కూడా వదల్లేదని టీడీపీలోని మరో వర్గం ఆరోపిస్తోంది.
విచారించి చర్యలు తీసుకుంటాం
బింగినపల్లి చెరువులో జామాయిల్ మొక్కలు నాటుతున్నారని తెలిసి సిబ్బందిని పంపించి ఆపించాను. తరువాత టీడీపీ నాయకుడు మాలకొండయ్య ఆ స్థలానికి రిజిష్టర్ డాక్యుమెంట్ ఉన్నాయని, స్థలం హక్కుదారుడంటూ మక్కె కోటిరెడ్డి అనే వ్యక్తిని తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. చెరువు స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడతాం.
– ఎస్‌వీబీ రాజేష్, తహసీల్దార్
బింగినపల్లి చెరువుపై కన్నేసిన టీడీపీ నేత
మండలంలో అతిపెద్దదైన బింగినపల్లి చెరువు
చెరువు పరిధిలో సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టు
సుమారు 50 ఎకరాల చెరువు ఆక్రమణకు యత్నం
చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు
చెరువును కాపాడాలంటున్న ఆయకట్టు రైతాంగం
రెండు ఎకరాల పొలాన్ని దున్నేశారు:
మా తాతల నాటి నుంచి ఎన్నో ఏళ్లుగా బింగినపల్లి చెరువు వద్ద 2 ఎకరాలు సాగు చేసుకుంటున్నాను. నా పొలాన్ని దున్నేశారని తోటి రైతులు చెప్పటంతో వచ్చి చూసుకుంటే నా స్థలాన్ని దున్నేశారు. అధికారులే న్యాయం చేయాలి.
– కొమరగిరి వరాస,
ఎస్టీ కాలనీ, పాతసింగరాయకొండ

చెరబట్టారు..!

చెరబట్టారు..!

చెరబట్టారు..!