
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి
మార్కాపురం: ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై దీపావళి పండగలోగా జీవో విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగుల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించారు. బుధవారం మార్కాపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 28న ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి అనుమతి ఇచ్చినప్పటికీ జీఏడీ విభాగంలో పెండింగ్ పెట్టి ఇంతవరకూ జీఓ విడుదల చేయలేదన్నారు. దీంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సుమారు 6 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని చెప్పారు. ఈ సమస్యను దీపావళిలోగా పరిష్కరించకుంటే ఉద్యమమే శరణ్యమని హెచ్చరించారు. అనంతరం మార్కాపురం ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద నూతనంగా నిర్మించిన ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చక్రపాణి, ఎస్‌వీఎస్ శాస్త్రి, బీబీ వెంకటేశ్వర్లు, సీహెచ్ జనార్దన్‌రావు, పి.శేఖర్‌నాయుడు, బాషా హుస్సేన్, మంగమ్మ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.