
న్యాయవాదుల రాస్తారోకో
సీజేఐపై దాడి యత్నానికి నిరసనగా
ఒంగోలు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఖండిస్తూ ఒంగోలులో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించడంతోపాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి జగ్జీవన్‌రామ్, సంయుక్త కార్యదర్శి గ్రేస్ కుమారిల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట రోడ్డుపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, న్యాయవ్యవస్థ స్వత్రంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దాడికి యత్నించిన న్యాయవాది లైసెన్స్‌ను రద్దుచేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు మరొకరు పాల్పడకుండా చర్యలు ఉండాలని కోరారు. సీజేపై దాడి యత్నం అనైతిక చర్య అని ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యులు నినదించారు.