వైద్యశాల శానిటేషన్‌ సిబ్బంది సమ్మె | - | Sakshi
Sakshi News home page

వైద్యశాల శానిటేషన్‌ సిబ్బంది సమ్మె

Sep 16 2025 8:28 AM | Updated on Sep 16 2025 8:28 AM

వైద్య

వైద్యశాల శానిటేషన్‌ సిబ్బంది సమ్మె

సమ్మె చేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది శిబిరంలో మాట్లాడుతున్న సీఐటీయూ నాయకుడు రఫీ

అస్తవ్యస్తంగా ఉన్న బాలింతల వార్డు

యర్రగొండపాలెం: స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో శానిటేషన్‌ సిబ్బంది సోమవారం సమ్మెకు దిగారు. తమకు 7 నెలల నుంచి జీతాలు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అందకపోవడం వలన తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. తాము గత 11 నెలల నుంచి ప్రాంతీయ వైద్యశాలలో ఫస్ట్‌ ఆబ్జెక్టివ్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శానిటేషన్‌ సిబ్బందిగా చేరి వైద్యశాల పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నామని, కరోనా కష్టకాలంలో కూడా మా ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వర్తించామని వారు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం వైద్యశాలను 30 పడకల నుంచి 100 పడకల వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసిందని, అందుకు తగినట్లుగా శానిటేషన్‌ సిబ్బందిని పెంచకపోవడం వలన పనిభారం ఎక్కువైనా తాము కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నామని వారు తెలిపారు. అను నిత్యం వైద్యశాల పరిశుభ్రతను కాపాడే తమకు 7 నెలల నుంచి జీతాలు ఇవ్వక పోవడం వలన తమ కుటుంబ పోషణ, నిర్వహణ చాలా ఇబ్బందిగా మారిందని, శానిటేషన్‌ సిబ్బందిలో వితంతువులు కూడా ఉన్నారని, తమ జీతాలతోనే జీవితాలు ముడిపడి ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెలా జీతాలు రాకపోవడంతోపాటు పీఎఫ్‌ బకాయిలు కూడా చెల్లించడం లేదని వారు ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము సమ్మె చేయాల్సి వచ్చిందని, వెంటనే జీతాలు, పీఎఫ్‌ బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.

అధ్వానంగా మారిన వైద్యశాల

శానిటేషన్‌ సిబ్బంది సమ్మెలో పాల్గొనడం వలన వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రోగుల వార్డు చెత్త చెదారంతో నిండిపోయింది. వైద్యశాలలో అక్కడక్కడా నీళ్లు నిలువచేరి రోగులకు ఇబ్బంది కలిగించింది. డస్ట్‌బిన్‌లు శుభ్రం చేయకపోవడం వలన దుర్వాసన వెదజల్లుతోందని పలువురు రోగులు ఆరోపించారు.

7 నెలల నుంచి జీతాలు అందడంలేదని ఆవేదన

ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో లోపించిన పారిశుద్ధ్యం

ఆర్‌ఎంవో హామీతో విరమించిన సమ్మె

ఈ నెల 19వ తేదీలోపు జీతాలు అందకుంటే నిరవధిక సమ్మె

నిరవధిక సమ్మెలోకి దిగాల్సి వస్తుంది

డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు వైద్యశాల ఆర్‌ఎంవో డాక్టర్‌ శివానంద శానిటేషన్‌ సిబ్బందితో చర్చలు జరిపారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం పనులు కుంటుపడటం వలన రోగులతోపాటు తామందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందని, తమకు రావాల్సిన జీతాలు త్వరలో అందచేసే బాధ్యతలను డీఎంహెచ్‌వో తీసుకున్నారని, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన కోరారు. ఈ నెల 19వ తేదీలోపు జీతాలు అందకుంటే తమ సభ్యులు నిరవధిక సమ్మెలో దిగాల్సి వస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ హెచ్చరించారు. ఆర్‌ఎంవో ఇచ్చిన హామీతో శానిటేషన్‌ సిబ్బంది సమ్మెను విరమించి విధుల్లో చేరారు.

వైద్యశాల శానిటేషన్‌ సిబ్బంది సమ్మె 1
1/1

వైద్యశాల శానిటేషన్‌ సిబ్బంది సమ్మె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement