
మెడికల్ షాపు నిర్వాహకుడి ఆత్మహత్య
ఒంగోలు టౌన్:
నగరంలో మెడికల్ నిర్వహిస్తున్న ఓ యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులప్పలపాడు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన కట్టా త్రినాథ్ చౌదరి ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటర్లో రమ్య మెడికల్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య సునీత అమెరికాలో ఎంఎస్ చదువుతోంది. మరికొన్ని రోజుల్లో త్రినాథ్ కూడా అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే ఆయనకు సుమారు 4 కోట్ల రుపాయల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా త్రినాథ్ హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం ఒంగోలు వచ్చిన ఆయన పాత కూరగాయల మార్కెట్ వద్ద గల ఒక లాడ్జిలో పైఅంతస్తులో దిగాడు. ఆదివారం రాత్రి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించాడు. ఎంతకూ బయటకు రాకపోయే సరికి లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తెరచిచూడగా అప్పటికే మరణించి ఉన్నాడు.
భార్యతో మనస్పర్థలే కారణమా?
చవటపాలెం గ్రామానికి చెందిన త్రినాథ్ ఉప్పుగుండూరుకు చెందిన సునీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2022లో వివాహం కాగా ఏడాది క్రితం ఎంఎస్ చదవడానికి భార్య సునీతను అమెరికాకు పంపించాడు. ఆమెతోపాటుగా సునీత సోదరుడిని కూడా అమెరికాకు పంపించి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో త్రినాథ్ అప్పు చేశాడు. అన్నీ సజావుగా ఉంటే మరికొన్ని రోజుల్లోనే తాను కూడా అమెరికా వెళ్లిపోవాలనుకున్నాడు. అయితే ఇటీవల కొంతకాలంగా భార్య సునీతకు త్రినాథ్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. దాంతో ఆమె త్రినాథ్ ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని, తనతో మాట్లాడటం పూర్తిగా మానేయడంతో మనోవేదనకు గురయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్నేహితులకు కూడా మెసేజ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అప్పుల తాలూకు ఒత్తిడి, మరోవైపు కట్టుకున్న భార్య దూరం కావడం భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. త్రినాథ్ తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులు.. అర్ధాంగితో మనస్పర్థలే కారణం
ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ వద్ద లాడ్జిలో ఘటన
మృతుడిది నాగులప్పలపాడు మండలం చవటపాలెం

మెడికల్ షాపు నిర్వాహకుడి ఆత్మహత్య