
మార్కాపురంలో ఇసుక దందా అరికట్టండి
● ధర్నాలో సీపీఎం నాయకుల డిమాండ్
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో కూటమి నేతల ఇసుక దందాను అరికట్టి భవన నిర్మాణదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దగ్గుబాటి సోమయ్య డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు ఇసుకను రూ.800కే లారీ యజమానులు సరఫరా చేస్తామంటున్నారన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు లారీ యజమానులను బెదిరించిచ తమ టర్బో లారీలతోనే ఇసుకను డంపింగ్ చేసి టన్నుకు రూ.1300 నుంచి రూ.1400కు విక్రయించడం అన్యాయమన్నారు. లారీ యజమానులకు రూ.లక్షల్లో జరిమానా వేయించడం దారుణమన్నారు. మార్కాపురం ప్రాంతంలో ఉచిత ఇసుక అందని ద్రాక్షలా తయారైందని, 20 రంగాలకు పైగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను ఇసుకను రూ.800కు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి రఫీ, మండల కార్యదర్శి జి.బాలనాగయ్య, నన్నేసా, రూబెన్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.