
మధ్యవర్తిత్వం సరళమైన విధానం
ఒంగోలు: మధ్యవర్తిత్వం సరళమైన, వేగవంతమైన విధానం అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం నుంచి శ్రీపొట్టి శ్రీరాములు బొమ్మ వరకు బుధవారం నిర్వహించిన మీడియేషన్ ఫర్ నేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియేషన్‌లో పరిష్కారమైన కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో చెల్లించిన కోర్టు ఫీజును కూడా తిరిగి పొందవచ్చన్నారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి న్యాయవాదులు సంపూర్ణంగా సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో మధ్యవర్తిత్వం మీద శిక్షణ పొందిన న్యాయవాదులు అయినాబత్తిన సుబ్బారావు, సిరిగిరి సరళ, దేవకుమారి, అదనపు ప్రభుత్వ న్యాయవాది బోడపాటి వెంకట శివరామకృష్ణ ప్రసాద్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గొల్లకారం రవిశంకర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.వీరరాఘవులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు
దరఖాస్తుల స్వీకరణ
చీమకుర్తి: చీమకుర్తిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో పదో తరగతి, సీనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మావతి బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. గతేడాది 9వ తరగతి పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించిన వారు, గతేడాది జూనియర్ ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన వారు గురువారం సాయంత్రం 5 గంటల్లోపు తమ సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు.