బిల్లు చెల్లించరు..! | - | Sakshi
Sakshi News home page

బిల్లు చెల్లించరు..!

Jul 17 2025 3:14 AM | Updated on Jul 17 2025 3:14 AM

బిల్ల

బిల్లు చెల్లించరు..!

ఇల్లు ఇవ్వరు..
మొండిగోడలకు మోక్షమెప్పుడో..!

మార్కాపురం:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా పేదలకు ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు. పాత గృహాలకు కూడా బిల్లులు మంజూరు కావడం లేదు. దీనితో పేదల పక్కా గృహాల నిర్మాణాలు నత్తనడకతో పోటీపడుతున్నాయి.

అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు కట్టిన గృహాలకు కూడా బిల్లులు తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. దీంతో లబ్ధిదారులంతా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 8837 గృహాలను శ్రావణమాసం నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4791 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, సిమెంట్‌, ఇటుక, ఇసుక, ఇనుము ధరలు పెరగడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖాధికారులపై ఒత్తిడి తెస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో దర్శి, యర్రగొండపాలెం, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు మందగించాయి. శ్రావణ మాసానికి గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ అధికారులపై కత్తి పెట్టింది. దీంతో ప్రతిరోజూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇల్లు కట్టుకోమని పోరుపెడుతుంటే డబ్బులెవరిస్తారంటూ లబ్ధిదారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రకటనతో 2014 నుంచి 2019 మధ్య ఇల్లు కట్టుకున్నవారు కూడా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

2019–2024 మధ్య కాలంలో ఇళ్ల లబ్ధిదారులకు స్వర్ణయుగమే.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి పట్టాలు ఇచ్చి గృహాలు మంజూరు చేశారు. అర్హులైన పేదలు సొంతిల్లు కావాలంటే ఎప్పుడైనా ఇంటికి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే..సిబ్బంది పరిశీలించి వెంటనే మంజూరు చేసేవారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల నగదుతో పాటు ఇంకా అవసరమైతే బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు సైతం చేసుకున్నారు. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తరువాత గ్రామాలు, కాలనీలే ఏర్పడ్డాయి.

కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉంటున్న లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇడుపూరు లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ లేక అవస్థలు పడుతున్నారు. వాటిని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

బిల్లుల కోసం ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు

లక్ష్యానికి 50 శాతం మాత్రమే పూర్తి

పూర్తి కావాల్సిన గృహాలు 8837

వివిధ దశల్లో పూర్తయినవి 4791 గృహాలు

చెప్పారంటే..చేయరంతే..

గతమెంతో ఘనం..

కనీస సౌకర్యాలు నిల్‌...

పేదల గృహాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ఎన్నికలకు ముందు

అది చేస్తాం.ఇది చేస్తామంటూ

ఆర్భాటంగా ప్రకటనలిచ్చిన కూటమి నేతలు..అధికారంలోకి వచ్చి ఏడాదైనా పేదలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదు.

ఒక్క రూపాయి బిల్లు కూడా మంజూరు చేయలేదు. ఓ పక్క పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు, మరో పక్క కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం..

వెరసి ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

పేదల ఇళ్లపై కక్ష కట్టి..

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పేదల గృహాలపై కక్ష కట్టింది. బిల్లులు మంజూరు చేయగా..కట్టుకుంటావా.. లేదా.. అంటూ గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తోంది. వివిధ కారణాలతో పలువురు పేదలు గృహాలను ఇంకా ప్రారంభించలేదు. దీంతో వైఎస్సార్‌ జగనన్న కాలనీలను రద్దు చేసే కుట్రకు ప్రభుత్వం తెరలేపింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురు పేదలకు ఈ నిర్ణయం పిడుగులాగా మారింది. ఏడాది కాలంలో ఒక్క ఇల్లూ మంజూరు చేయకపోగా ఉన్న వాటిని రద్దు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల నిర్మాణంలో కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు లేఅవుట్‌ –1, 2 లో 2,330 గృహాలు మంజూరు కాగా 920 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక 2014–19 మధ్య కట్టుకున్న 1546 గృహాలకు రూ.4 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా మంజూరుకాలేదు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం:

బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కాలనీల్లో కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అందిస్తాం.

పవన్‌కుమార్‌, హౌసింగ్‌ డీఈ,

మార్కాపురం

బిల్లు చెల్లించరు..! 1
1/1

బిల్లు చెల్లించరు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement