
టోల్ బాదుడు..!
పెద్దదోర్నాల: శ్రీశైలం వెళ్లే రహదారిలో గణపతి చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌తో వాహనదారులు రెండో సారి టోల్ రుసుం చెల్లిస్తూ వారికి తెలియకుండానే నష్టపోతున్నారు. వివరాల్లోకి వెళితే..నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించే వాహనాలు విధిగా పర్యావరణ పరిరక్షణ రుసుంను చెల్లించేలా పెద్దదోర్నాల మండల కేంద్రం సమీపంలోని గణపతి వద్ద ఓ చెక్ పోస్టు, కర్నూల్ రోడ్డులోని కొర్రప్రోలు వద్ద మరో చెక్ పోస్టును అటవీశాఖ అధికారులు గతంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా శిఖరం, చెక్ పోస్టు వద్ద, బైర్లూటి చెక్ పోస్టుల వద్ద ఒక్కసారి రుసుం చెల్లిస్తే మరే చెక్‌పోస్టు వద్ద రుసుంను చెల్లించకుండా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించవచ్చు. ఈ ప్రక్రియను కొంత కాలం వరకు మాన్యువల్‌గా నిర్వహించేవారు. దీంతో నంద్యాల జిల్లా బైర్లూటి చెక్ పోస్టు వద్ద టోల్ రుసుమును చెల్లించిన వాహన దారులు అక్కడ చెల్లించిన రశీదులను చూపించి గణపతి చెక్ పోస్టును దాటేవారు. అయితే కాలక్రమేణా గణపతి చెక్ పోస్టు వద్ద టోల్ గేట్‌ను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు ఫాస్టాగ్ యంత్రాన్ని సమకూర్చారు. దీంతో గతంలో కార్లు, చిన్నపాటి వాహనాలకు రూ.50, లారీలు, పెద్ద వాహనాలకు రూ.100 వసూలు చేసే అధికారులు టోల్ గేట్ పెట్టిన నాటి నుంచి రేట్లను పెంచి కార్లకు రూ.70, లారీలకు రూ.130 టోల్ ఫీజుగా నిర్ణయించి వసూలు చేస్తున్నారు.
అవగాహన లేక నష్టపోతున్న వాహనదారులు
గణపతి చెక్ పోస్టు వద్ద ఉన్న రహదారిని రెండు భాగాలుగా విభజించిన అధికారులు ఒక రహదారి శ్రీశైలం వెళ్లేదిగా, రెండో రహదారిని శ్రీశైలం నుంచి వచ్చేదిగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లే రహదారిలో ఆటోమేటిగా టోల్ రుసుం వసూలు చేసేలా యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అవగాహన లేని కొందరు వాహనదారులు బైర్లూటి చెక్ పోస్టు వద్ద టోల్ చార్జీని చెల్లించినా, తిరిగి గణపతి చెక్ పోస్టు వద్ద వారికి తెలియకుండానే రహదారిలో ప్రయాణించి టోల్ రుసుంను చెల్లిస్తున్నారు. చెక్ పోస్టు గేట్‌ను దాటిని తరువాత తమ తప్పును తెలుసుకున్నా, చేసేది లేక గమ్మున్న ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటక, కర్నూల్, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన పలువురు వాహనదారులు తమకు తెలియకుండానే టోల్ రుసుంను రెండోసారి చెల్లించి నష్టపోతున్నారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంపై వాహనదారులకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకొని, బైర్లూటి వద్ద టోల్ రుసుం చెల్లించిన వాహనాలను మరో మార్గంలో పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
శ్రీశైలం వెళ్లే వాహనాలకు డబుల్ టోల్ వసూలు
గణపతి వద్ద చెక్‌పోస్టు వద్ద టోల్‌గేట్ ఏర్పాటు చేసిన అధికారులు
బైర్లూటి వద్ద చెల్లించినా, అవగాహన లేక
రెండోసారి టోల్ చెల్లింపు
తెలియక నష్టపోతున్న కర్నాటక, రాయలసీమ జిల్లాల వాహనదారులు

టోల్ బాదుడు..!