
చెల్లని చెక్కు కేసులో జైలు
గిద్దలూరు రూరల్: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో హెచ్‌ఎంపాడుకు చెందిన రాచూరి రంగారావుకు గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.భరత్‌చంద్ర ఏడాది జైలుశిక్షతో పాటు రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన దాసరి బాల సుబ్బయ్య వద్ద హెచ్‌ఎంపాడుకు చెందిన రంగారావు 2016 లో వ్యక్తిగత కారణాలపై నగదు తీసుకొని చెల్లని చెక్కు ఇచ్చాడు. ఈ మేరకు బాధితుడు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.10 లక్షలు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.
మున్సిపల్ కార్మికుల
వంటావార్పు
మార్కాపురం టౌన్: సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి డీకే రఫీ మాట్లాడుతూ జీఓ నం.36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. గత 4 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంఏ కార్యాలయం వద్ద జరిగే నిరసనలో కార్మికులు పాల్గొనాలని అన్నారు. సమావేశంలో రూబెన్, సుబ్బరాయుడు, హరికృష్ణ, చెన్నరాయుడు, అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాజీ రాజు తెలిపారు.
ప్రశాంతంగా ఏపీపీఎస్‌సీ పరీక్షలు
ఒంగోలు సబర్బన్: ఏిపీపీఎస్‌సీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ప్రశాంతంగా జరిగాయి. లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తోంది. ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 6 సెంటర్లలో పరీక్ష జరుగుతోంది. రెండో రోజు బుధవారం ఒంగోలు నగరం మామిడిపాలెంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కాలేజీలో ఉదయం పరీక్షకు 170కు గాను 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 135 కి గాను 62 మంది హాజరయ్యారు. అదే విధంగా ఒంగోలులోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరిగిన పరీక్షకు 97 మందికి గాను 41 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు సందర్శించారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న పరీక్ష తీరును ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఆస్తి కోసం వేధిస్తున్నారని తల్లి ఫిర్యాదు
● కుమార్తె, అల్లుళ్లపై కేసు నమోదు
పెద్దదోర్నాల: ఆస్తి కోసం తనను వేధిస్తున్నారంటూ కొత్తూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సై మహేష్ ఆమె కుమార్తె, అల్లుళ్లపై కేసు నమోదు చేశారు. కొత్తూరుకు చెందిన ఓ వితంతువుకు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన పత్తి పంటను సోమవారం అమె కుమార్తె, అల్లుళ్లు కలిసి ధ్వంసం చేశారని ఆమె ఆరోపించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో తల్లి యేరువ చిన్నమ్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
కరేడులో మానవ హక్కుల వేదిక నాయకుల పర్యటన
ఉలవపాడు: మండలంలోని కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం మానవ హక్కుల వేదిక నాయకులు పర్యటించారు. పరిశ్రమలకు భూ సేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులకు సంఘీభావంగా కరపత్రాలు పంచిపెట్టారు. ప్రజల ఆమోదాన్ని కాదని భూసేకరణ చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ప్రాజెక్టును తక్షణమే రద్దు చేసి భూ సేకరణ ప్రకటనలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రోహిత్, రాష్ట్ర చేనేత జనసమాఖ్య అధ్యక్షుడు మోహన్‌రావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో జైలు

చెల్లని చెక్కు కేసులో జైలు