
డిజిటలైజేషన్‌తో పనితీరు వేగవంతం
ఒంగోలు టౌన్: జిల్లాలోని అన్నీ పోలీస్‌స్టేషన్లలో టెక్నాలజీ వినియోగం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసు శాఖ ఆధునికీకరణలో భాగంగా బుధవారం పోలీస్‌స్టేషన్లకు ఆధునిక డిజిటల్ పరికరాలను ఎస్పీ అందజేశారు. 176 ఆల్‌ఇన్ వన్ కంప్యూటర్లు, 44 వెబ్ కెమెరాలు, 48 ప్రింటర్లను ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను అందించినట్లు తెలిపారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, విచారణ, న్యాయ ప్రక్రియ, కేసు ముగింపు వరకు సాగే ప్రతి దశను డిజిటల్‌గా నమోదు చేసేలా చేసేలా ఈ ఆధునిక పరికరాలు ఉపయోగపడతాయన్నారు. పాత టెక్నాలజీకి బదులు నూతన కంప్యూటర్ల పనితీరు పోలీసు శాఖకు ఎంతో ఉపయుక్తం అవుతాయని చెప్పారు. కేసులు మరింత పారదర్శకంగా ఉండేలా, ప్రజలు తమ కేసుల స్థితిగతులను ఆన్‌లైన్లో తేలికగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తాయన్నారు. పర్చువల్ విచారణలు, వీడియా రికార్డింగ్, సాక్ష్యాల డిజిటల్ స్టోరేజీ వంటి ఆధునిక విధానాలకు అనుగుణంగా ఉపయోగపడతాయని తెలిపారు. క్రైమ్ అనాలిసిస్, డేటా ఇంటిగ్రేషన్, నేరాల నిరోధంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పీఎస్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్‌బీ సీఐ రాఘవేంద్ర, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, సీఐలు నాగరాజు, మేడా శ్రీనివాసరావు, విజయకృష్ణ, సుధాకర్, హజరత్తయ్య, శ్రీకాంత్, డీటీసీ సీఐ షమీముల్లా, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
జిల్లా పోలీసులకు ఆధునిక కంప్యూటర్లను
అందజేసిన ఎస్పీ