
కూలీలు రాకుండానే హాజరు
సింగరాయకొండ: ‘కూలీలు రాకుండానే హాజరు వేశారు. చేసిన పనుల్లో కొలతలు తేడా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో పనులు కానిచ్చేశారు’అని సామాజిక తనిఖీ బృందం సభ్యులు ప్రజావేదికలో నివేదిక చదివి వినిపించారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.11.32 కోట్ల పనులపై సామాజిక తనిఖీ బృందం చేపట్టిన విచారణ వివరాలను బుధవారం ప్రజావేదికలో వివరించారు. ఈ సందర్భంగా పీడీ జోసెఫ్ గతంలో ఈసీగా పనిచేసిన భార్గవి, కొన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూ.2.53 లక్షలు కొలతల్లో తేడా వచ్చిందని, ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి రూ.44,500, రూ.3,,600 జరిమానా కింద అధికారులు, సిబ్బంది నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. రూ.1.64 లక్షల పనులకు సంబంధించి ఏపీడీ సుబ్బారావును విచారించాలన్నారు. కూలీలకు చేసిన పనులకు సంబంధించి రావాల్సిన రూ.88,246 వారి ఖాతాలకు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ ప్రతి కూలీకి దినసరి వేతనం రూ.306లుగా ప్రభుత్వం నిర్ణయించిందని, సరాసరిన రూ.250 వస్తుందని తెలిపారు. దీనిపై పలువురు వారానికి రూ.100 ఇచ్చిన కూలీలకు రూ.1200 జమవుతున్నాయని, నగదు ఇవ్వని వారికి కేవలం రూ.600 మాత్రమే జమవుతున్నాయని, అలాంటప్పుడు సరాసరి రూ.250 ఎలా పడుతుందని ప్రశ్నించారు. తక్కువ మంది కూలీలు వస్తే ఎక్కువ మంది వచ్చినట్లు హాజరు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పగా, యర్రగొండపాలెం, చుట్టుపక్కల మండలాల్లో ఈ సంస్కృతి ఉందని ఇక్కడ కూడా ఉందా అని పీడీ మండల అధికారులను ప్రశ్నించడంతో వారంతా విస్తుపోయారు. కార్యక్రమంలో ఎంపీడీఓ డి.జయమణి, ఏపీఓలు సుభాషిణి, సుధాకర్, ఎస్‌ఆర్‌పీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.11.32 కోట్ల ఉపాధి పనులపై ప్రజావేదిక
అధికారులు, సిబ్బందికి జరిమానా
రూ.2.53 లక్షల రికవరీ చేయాలని ఆదేశం