
రౌండ్ రౌండ్‌కూ రైతుల ఘోష రీసౌండ్!
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో ఎనిమిదో రౌండ్ ప్రారంభం నుంచి బేళ్ల తిరస్కరణ సంఖ్య పెరిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడో రౌండ్ ప్రారంభమైన రోజు నుంచి రౌండ్ చివరి దశ సమయం వరకు రోజుకు దాదాపుగా 200పైగా బేళ్లు తిరస్కరణకు గురవుతూ వచ్చాయి. 8వ రౌండ్ ప్రారంభం నుంచి బేళ్ల తిరస్కరణ రోజుకు దాదాపు 300పైగా ఉన్నాయి. అసలే మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బేళ్ల తిరస్కరణతో ఖర్చు అధికమవుతుందని వాపోతున్నారు. అధికారులు పర్యటించి అన్ని బేళ్లను కొనుగోలు చేయాలని వ్యాపారస్తులకు సూచించినా వ్యాపారస్తులు అధికారుల మాటలను పట్టించుకోవట్లేదు. ఏడో రౌండ్ మధ్యలో రీజినల్ మేనేజర్ శీలం రామారావు పొగాకు వేలాన్ని పరిశీలించి అన్ని బేళ్లు కొనుగోలు చేయాలని వ్యాపారస్తులకు సూచించారు. ఆ సమయంలో వ్యాపారస్తులు అన్నీ బేళ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ప్రతిరోజూ వందల బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. గత సంవత్సరంలో కేజీ రూ.240 పలికిన లో గ్రేడ్ పొగాకును వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు వెనక్కి తీసుకుపోతున్నారు. మళ్లీ వాటిని తీసుకురావాలంటే వ్యయప్రయాసలకు లోను కావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
326 బేళ్ల తిరస్కరణ
మంగళవారం జరిగిన వేలంలో 326 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి.సునీల్‌కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కొండపి, పోలిరెడ్డి పాలెం, చౌటపాలెం, రామాయపాలెం, దాసిరెడ్డిపాలెం గ్రామాల రైతులు 1091 బేళ్లను తీసుకురాగా 765 బేళ్లను కొనుగోలు చేసి 326 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160గా నమోదైంది. వేలంలో 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
8వరౌండ్ ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో బేళ్ల తిరస్కరణ
ఏడో రౌండ్ వరకు నిత్యం 200 బేళ్లు తిరస్కరణ
8వ రౌండ్ ప్రారంభం నుంచి 300 బేళ్లకు పైగా తిరస్కరణ