
‘గ్రామ సమాఖ్య’ స్ఫూర్తికి విఘాతం
బేస్తవారిపేట: టీడీపీ నాయకుల ఒత్తిడితో అక్రమంగా వీఓఏలను తొలగించిన అధికారులు తాజాగా గ్రామ సమాఖ్య కమిటీలను ఇష్టారీతిగా మార్చడం చర్చనీయాంశమైంది. రూల్స్ పుస్తకాల్లో ఉంటాయి.. కానీ తమకు వర్తించవు, తాము పాటించము అన్నట్లు ఉంది వెలుగు కార్యాలయ సీసీలు వ్యవహార శైలి. వివరాల్లోకి వెళ్తే.. బేస్తవారిపేట మండలంలోని వంగపాడు, ఖాజీపురం, ఎంపీ చెరువు గ్రామ సమాఖ్య కమిటీలను గుట్టుచప్పుడు కాకుండా తొలగించి కొత్త కమిటీలను తెరపైకి తీసుకొచ్చారు. సాధారణంగా ఒక్కో గ్రామ సమాఖ్య కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఏపీ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం బైలా నిబంధనల ప్రకారం సభ్యుల తొలగింపునకు 30 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి గ్రామ సమాఖ్య సమావేశం నిర్వహించాలి. ఏటా 3తో భాగించబడే పాలకవర్గ సభ్యులు పదవీ విరమణ చేయగా.. కొత్తవారిని నియమించడం లేదంటే వారినే ఎన్నుకోవాలన్నది నిబంధన. ఎప్పటికీ ఐదుగురు సభ్యులను ఒకేసారి తొలగించకూడదనే నిబంధన సైతం బైలాలో పొందుపరిచారు. కొత్తగా ఇద్దరిని మాత్రమే గ్రామ సమాఖ్య కమిటీలోకి తీసుకోవాలని బైలాలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ పాత కమిటీ సభ్యులకు తెలియకుండానే వెలుగు సీసీలు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఐదుగురు సభ్యులను కొత్తవారిని ఎన్నుకున్నట్లు సీసీ సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు లెటర్ ఇవ్వడంతో బ్యాంకులో నూతన కమిటీ సభ్యులతో బ్యాంక్ ఖాతా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో గ్రామ సమాఖ్యలో ఉన్న నగదు విత్‌డ్రా చేశారు. ఆ డబ్బు ఏమైందో తెలియడం లేదని పాత కమిటీ సభ్యులు వాపోతున్నారు. గ్రామ సమాఖ్య కమిటీ సభ్యుల అడ్డగోలు తొలగింపుపై వంగపాడు గ్రామానికి చెందిన పాత కమిటీ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
బైలాను తుంగలో తొక్కి ఇష్టారీతిగా కమిటీల మార్పు సమాఖ్య నిధుల దోపిడీకి స్కెచ్