
ప్రభుత్వ పాఠశాలలకు 3 లక్షల మంది దూరం
చీమకుర్తి: కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోయిందని, ఫలితంగా ఈ ఏడాది 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేఎస్‌ఎస్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. చీమకుర్తిలో శనివారం నిర్వహించిన యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ మండల విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశాలను విద్యారంగంపై రుద్దుతోందన్నారు. రెండేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను అప్పటి ప్రభుత్వం హైస్కూళ్లకు పంపించిందని, వారికోసం పదోన్నతుల పేరుతో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా నియమించిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం హైస్కూళ్లలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపించిందన్నారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ హైస్కూళ్లలో ఇటీవల పదోన్నతులు పొందిన స్కూలు అసిస్టెంట్లను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపించిందని తెలిపారు. అంతేతప్ప కూటమి ప్రభుత్వం విద్యారంగంలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఏమీ లేవన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారన్నారు. అమ్మ ఒడి, నాడు–నేడు ఆధునికీకరణతో కోవిడ్ సమయంలో ప్రైవేటు పాఠశాలల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చారన్నారు. నేడు తల్లికి వందనం వలన విద్యార్థుల హాజరు శాతం పెరగకపోగా, పలు రకాల యాప్‌ల భారం కారణంగా ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి పెరిగి విద్యార్థులు నాణ్యమైన బోధనకు దూరమవుతున్నారన్నారు. దానివలన విద్యార్థుల తల్లిదండ్రులలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని కేఎస్‌ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, 11వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని కోరారు.
యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉపాధ్యాయుల జీతాల సమస్యలు రాకుండా పొజిషన్ ఐడీలు, క్యాడర్ స్ట్రెంగ్త్‌లను వెంటనే తెప్పించాలన్నారు. తొలుత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో యూటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న పాత్రను అభినందించారు. తొలుత యూటీఎఫ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ హైస్కూళ్లలో పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరించారు. ఇటీవల జరిగిన పదోన్నతులు, బదిలీలపై వెళ్లిన వారిని యూటీఎఫ్ మండల శాఖ తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీ జవహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్‌హై, డీ వీరాంజనేయులు, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రవి, జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కే అక్బర్, చలువాది శ్రీనివాసరావు, యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఏడాది తగ్గిన విద్యార్థుల అడ్మిషన్లు ఉపాధ్యాయులపై యాప్‌ల భారం.. విద్యార్థులకు బోధన దూరం తల్లిదండ్రుల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిన కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అనుసరిస్తున్న పాలకులు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేఎస్‌ఎస్ ప్రసాద్ ధ్వజం