
ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో చోరీ
కంభం: ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు అపహరించారు. ఈ సంఘటనలు శుక్రవారం కంభం పట్టణంలో చోటుచేసుకున్నాయి. వివరాలు.. బస్టాండ్ సమీపంలోని రహమత్‌నగర్ మొదటి లైనులో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు చల్లా కోటయ్య కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. మూడు బంగారు ఉంగరాలు, చెవి పొగులు, కమ్మలు సహా మొత్తం 3 తులాల బంగారం, రూ.2 వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఉదయం 10.30 గంటల తర్వాత ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని వచ్చి వెళ్లినట్లు సమీపంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉంది.
● ఎల్‌బీఎస్ నగర్‌లో నివాసం ఉంటున్న మరో మాజీ సైనికుడు రంగనాయకులు పది రోజుల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. కింద ఇల్లు ఖాళీగా ఉండగా పైన వారు నివాసం ఉంటున్నారు. శుక్రవారం పైన ఇంటి కటాంజనం కొంత తెరుచుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు పైకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉంది. యజమానులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా తలుపు పూర్తిగా విరగగొట్టి మంచం మీద పెట్టారు. బీరువాలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. సుమారు మూడున్నర తులాల బంగారు నగలు, రూ.10 వేల వరకు నగదు చోరీ అయినట్లు యజమానులు చెప్పారు. చోరీ జరిగిన రెండు గృహాలను ఎస్సై నరసింహారావు పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.
బంగారు ఆభరణాలు, నగదు అపహరణ

ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో చోరీ