
రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి
రాచర్ల: ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో గొర్రెల కాపరితోపాటు 10 జీవాలు మృతి చెందాయి. ఈ సంఘటన రాచర్ల మండలంలోని యడవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 199–10 మైలు రాయి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొత్తకోట రాధాకృష్ణ(38) తన 50 గొర్రెలను మేత కోసం సత్యవోలు వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్తున్నాడు. గొర్రెల మందను రైల్వే ట్రాక్ దాటిస్తున్న సమయంలో గుంటూరు నుంచి ఔరంగబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. గొర్రెలను పక్కకు తోలేందుకు ప్రయత్నించిన రాధాకృష్ణను రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందగా, 5 గొర్రెలు తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన ఎగిరిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన రైల్వే గార్డు ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాధాకృష్ణను అదే రైలులో గిద్దలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల జీఆర్‌పీ కానిస్టేబుల్ షేక్.ఖలీల్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి