
హామీలు నెరవేర్చలేని బాబు సిగ్గుపడాలి
నాగులుప్పలపాడు: ప్రజలకు నాలుగింతల మంచి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వాటిని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు, జైళ్లలో పెడుతున్నా కార్యకర్తలు, నాయకులు ఏ మాత్రం భయపడకుండా మళ్లీ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఈ సమావేశానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలే నిదర్శనమన్నారు. ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తే వాటిని ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడుతున్న జగన్‌మోహన్ రెడ్డి బయటకు వస్తే ఓ సంచలనంగా ఉందని, దీనిని చంద్రబాబు ప్రభుత్వం ఓర్చుకోలేక అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. పొగాకు రైతుల పక్షాన పోరాటం చేస్తే తట్టుకోలేని కూటమి నాయకులు ఆ సభలో రాళ్లు రువ్వి చేసిన గందరగోళం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్ని కూటములు ఏకమైనా, కుట్రలు చేసినా ప్రజాతీర్పు భవిష్యత్‌లో జగన్‌మోహన్ రెడ్డికే ఉందన్నారు. ఈ సారి జగన్ 2.0 పాలనలో కార్యకర్తలే కీలకంగా మారనున్నారన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం గోతులు తీసే నాయకత్వం చేయనని, జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తూ ఆనాడు పాదయాత్రలో డా.వైఎస్సార్ అమలు చేసిన 108, ఆరోగ్యశ్రీ అనేవి ఈనాటికీ ప్రజల్లో చిరస్థాయి గా నిలిచిపోయాయన్నారు. అలాంటి పాలనే మళ్లీ జగన్‌మోహన్ రెడ్డిలో చూశామని అన్నారు. రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో మేరుగు నాగార్జున, శివప్రసాద్ రెడ్డిలకు అండగా ఉండాలని కార్యకర్తలను కోరారు.
పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా.మేరుగు నాగార్జున మాట్లాడుతూ తాను ఈ నియోజకవర్గానికి వచ్చాక ఈ ప్రాంతానికి మహానేత వైఎస్సార్ వలన జరిగిన మంచిని కళ్లారా చూశానని ఇలాంటి ప్రాంతానికి తాను సేవ చేసే భాగ్యం కల్పించిన జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞుడనన్నారు. మోసపూరిత హామీలతో గెలిచిన కూటమి నాయకులు నేడు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పారిపోయే రకాన్ని కాదన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తుపెట్టుకొని భవిష్యత్ లో వారికి సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తానన్నారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. హామీలేవీ అమలు చేయకుండా మోసగించిందన్నారు.
పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు తన ముసలితనంలో బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నాడో సమాధానం చెప్పాలన్నారు.
ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వలన జగన్ కు వస్తున్న ఆదరణ చూసి అసలు అధికారంలో ఎవరున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచిన కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు.
అనంతరం త్వరలో క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించే క్యూఆర్ కోడ్ స్కానర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పాలడుగు రాజీవ్, వేమా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, మేధావుల సంఘం రాష్ట్ర సెక్రటరీ కంచర్ల సుధాకర్, మారెడ్డి సుబ్బారెడ్డి, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు మండల పరిషత్ అధ్యక్షుడు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, వాకా అరుణ కోటిరెడ్డి, బుడంపాటి విజయ, యద్దనపూడి శ్రీనివాసరావు, మండలాధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, పోలవరపు శ్రీమన్నారాయణ, దుంపా చెంచిరెడ్డి, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టిపాటి శేఖర్ రెడ్డి, తేళ్ల పుల్లారావు, బెజవాడ రాము, గుడ్డపాతల రవి, నారా విజయలక్ష్మి, నన్నపురెడ్డి రవణమ్మ, కాకర్లపూడి రజనీ, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు