
ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
ఒంగోలు టౌన్:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలను దేశంలోని అన్నీ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే మరింత ఉధృతంగా పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లకు అనుకూలంగా పనిగంటలను పెంచిందని మండిపడ్డారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి అద్దంకి బస్టాండు సెంటర్, మస్తాన్ దర్గా, ట్రంకు రోడ్డు, చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ప్రకాశం భవనం వద్ద నిర్వహించిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశంలోని నిరుపేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ధనవంతులు, అవినీతిపరులు, అక్రమార్కులు మాత్రమే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారని అన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కనీసం మౌలిక వసతులను కూడా కల్పించలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా రూ.30 కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి పోరాడుతున్నారని తెలిపారు.
కనీస వేతన చట్టాలు అమలు చేయాలి:
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల కోసం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం దొడ్డిదారి ప్రయత్నాలు మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, ఉద్యోగుల అభిప్రాయాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా చట్టాలను మార్చడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఉపాధిహామీ పనులను ఏడాదిలో 200 రోజులు నిర్వహించాలని, రోజుకి రూ.600 వేతనం ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశ యూనియన్ల నాయకులు అన్నపూర్ణ, మేరి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీం వర్కర్లను తొలగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీ సమ్మెకు ఎస్‌డీపీఐ నాయకులు షేక్ సత్తార్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్.లలిత కుమారి, బి.పద్మ, శ్రీరాం శ్రీనివాసరావు, జి.రమేష్, తంబి శ్రీనివాస్, ఎంఏ సాలార్, తాళ్లూరు వెంకటేశ్వర్లు, జె.ఉదయ కిరణ్, టి.విజయ, కేవీ సుబ్బమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు సర్కార్ సార్వత్రిక సమ్మెలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు హెచ్చరిక

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి