
బధిరుల సమస్యలను పరిష్కరించాలి
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని బధిరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బధిరుల సంఘ నాయకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ సువార్తని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క బధిరునికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో బధిరులకు రిజర్వేషన్ రోస్టర్‌ను తప్పక పాటించాలని కోరారు. బధిరులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో బధిర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి ఎం.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకులను త్వరగా గుర్తించాలి
● జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ
ఒంగోలు సబర్బన్: పీ–4 పథకం కింద మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలోని పురోగతిపై సమీక్షించేందుకు బుధవారం ఆయన ప్రకాశం భవనం నుంచి నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు కూడా తమ శక్తి మేరకు ‘బంగారు కుటుంబాల’కు అండగా నిలిచేలా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చెప్పారు. ఈ నెలాఖరికే మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసేలా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులను, ఉన్నత విద్యావంతులను, వ్యాపార, పారిశ్రామికవేత్తలను సంప్రదించి ‘మార్గదర్శకులు’గా వారు ముందుకు వచ్చేలా చూడాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బధిరుల సమస్యలను పరిష్కరించాలి